సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): అబద్ధపు హామీలిస్తూ , ప్రజాగోడు పట్టని బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగడానికి మునుగోడుకు వస్తున్నారని తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ రావు ప్రశ్నించారు. మునుగోడుకు రాబోతున్న కేంద్ర బీజేపీ నేతలకు జగన్ పలు ప్రశ్నలు సంధించారు. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మునుగోడులో చేనేత కోసం ఏం చేశారు? చేనేత వస్ర్తాలపై జీఎస్టీ విధించినందుకు ఓటు వేయాలా? అని విమర్శించారు. ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న మునుగోడు ప్రజలకు ఫ్లోరైడ్ రీసెర్చ్ మిటిగెషన్ సెంటర్ ఇస్తామని మోసం చేసినందుకు ఓటు వేయాలా? బీజేపీలో చేరినందుకు 18వేల కోట్లు ఇచ్చినందుకు ఓటు వేయాలా ? అని ప్రశ్నించారు.
మునుగోడు రైతుల కోసం శివన్నగూడెంలో రిజర్వాయర్ కడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఇవ్వనందుకు ఓటు వేయాలా ? ఫ్లోరైడ్ నిర్మూలనకు మిషన్ భగీరథతో నీళ్లు ఇస్తే… ఈ పథకానికి పైసలు ఇవ్వనందుకు ఓటు వేయాలా ? అని విమర్శించారు. హుజురాబాద్, దుబ్బాకలో గెలిచిన బీజేపీ నేతలు కేంద్రం నిధులు ఎన్ని తీసుకువచ్చారో చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. 2016లో మర్రిగూడలో నాడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటించి ఫ్లోరైడ్ రీసెర్చ్ అండ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని, ఆరేండ్లు దాటిన నయా పైసా ఇవ్వలేదన్నారు. ఈ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం 8.2 ఎకరాలు చౌటుప్పల్‌లో కేటాయించిందని గుర్తు చేశారు. అబద్ధాలు చెప్పే బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని జగన్ స్పష్టం చేశారు.