సిటీబ్యూరో, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం ఆసరా పింఛన్లను విజయవంతంగా అమలు చేస్తున్నది. గతంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా కొత్ల పింఛన్లు జారీ చేయడంలో హైదరాబాద్ జిల్లా ముందంజలో ఉన్నది. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పంపిణీ ప్రక్రియ జరుగుతున్నట్లు జిల్లా డీఆర్వో సూర్యలత తెలిపారు. ఆసరా పింఛన్ల కోసం జిల్లా వాప్తంగా మొత్తం 81,282 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఈ నెల 18 వరకు మొత్తం 50,186 పింఛన్ కార్డులు పంపిణీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. మిగిలిన 31,096 దరఖాస్తులకు సంబంధించి నెల రోజుల్లో కార్డులు పంపిణీ చేయడానికి తాసీల్దార్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.