గౌతంనగర్, అక్టోబర్ 20: బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూల్లో చదువుతున్న నాలుగున్నరేండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు భీమన రజినీకుమార్‌ను బుధవారం అరెస్టు చేసిన సంఘ టన విధితమే. ఈ నేపథ్యంలో గురువారం మల్కాజిగిరి సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు. సఫిల్‌గూడ డీఏవీ ప్రిన్సిపాల్ పార్థిపన్ బంజారాహిల్స్ బ్రాంచ్ డీఏవీ స్కూల్‌కు ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు. అత్యాచార ఘటనపై అతన్ని నిలదీశారు. అయితే..ప్రిన్సిపాల్ పార్థిపన్ సరైన సమాధానం చెప్పకుండా.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అత్యాచార ఘటనకు బాధ్యులైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని దోషులను కఠినంగా శిక్షించాలని ప్రిన్సిపాల్‌పై దాడి చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో నేరేడ్మెట్ పోలీసులు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. ఘటనకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కుషాయిగూడ ఏసీపీ రేష్మీపెరుమాళ్ తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ పార్థిపన్ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఏవీ స్కూల్ మేనేజర్ శేషాద్రీనాయుడు గురువారం తెలిపారు.
అత్యాచార ఘటన బాధాకరం : ఎమ్మెల్యే మైనపంల్లి
బంజారాహిల్స్ డీఏవీ స్కూల్లో జరిగిన ఘటన బాధాకరమని, నిందితుడు భీమన రజినీకుమార్‌ను కఠినంగా శిక్షించాలని, నిర్లక్ష్యంగా వ్యహరించిన ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిపై చట్టపరమైన కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. డీఏవీ స్కూళ్లు దేశవ్యాప్తంగా ఉన్నాయని, ఇలాంటి ఘటనలు పూనరావృతం కాకుండ స్కూల్ యజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెడ్ ఆఫీస్ అధికారులతో మాట్లాడారు. తాను మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నా.. ఘటనా తెలిసినప్పటి నుంచి ఢిల్లీలో ఉన్న డీఏవీ స్కూల్ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడానని, ఆదేవిధంగా రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీతో మాట్లాడామని, నిందితుడితో పాటు స్కూల్ ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆయన అన్నారు.