మునుగోడు, అక్టోబర్ 20 : మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు కొరటికల్ గ్రామంలో మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడపగడపకూ వెళ్తూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటర్లతో మమేకమయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఓటేసి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో ఆయన ఓ వృద్ధురాలిలో కాసేపు ముచ్చటించారు. రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతుగా కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజగోపాల్‌రెడ్డి స్వార్థంతో మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందన్నారు. ప్రజలు గెలిపించేది సొంత పనులు చేసుకోవడానికి కాదని మంత్రి విమర్శించారు. చేనేత వస్ర్తాలపై పన్ను వేసిన తొలి ప్రధాని మోదీనే అని అన్నారు. పొదుపు, బీమా పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ రద్దు చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలను ఆదుకుంటూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు.