హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ) : బీజేపీపై మునుగోడు గొల్లకురుమలు తిరుగబడ్డారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సబ్సిడీని ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడాన్ని నియోజకవర్గంలోని యాదవులు మండిపడుతున్నారు. ఫ్రభుత్వం తమ ఉపాధికి ఇచ్చే గొర్ల యూనిట్ సబ్సిడీ మొత్తాన్ని ఆపేయాలని బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో తమ నోటికాడి బుక్కను ఎత్తగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొర్లు కాసుకొని బతికే తమ జీవితాల్లో వెలుగులు నింపాలని టీఆర్ఎస్ ప్రభు త్వం 75శాతం సబ్సిడీతో గొర్ల యూనిట్లను మంజూరు చేస్తే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ జీవితాలను చీకటి చేసేందుకే కంకణం కట్టుకున్నదని గొల్ల కురుమలు శాపనార్థాలు పెడుతున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. తమకు రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీని అడ్డుకునే హక్కు ఎక్కడిదని గొల్లకురుమలు నిప్పులు చెరుగుతున్నారు. గొల్లకురుమలకు అన్యాయం చేసిన రాజగోపాల్‌రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్తామహెచ్చరిస్తున్నారు. రూ.18వేల కోట్లకు అమ్ముడుపోయిన ఆయన, గొర్లు కాసుకుంటూ జీవించే తమకు తీవ్ర అన్యాయం చేసిండని మండిపడుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌కి ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెబుతామని యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండబోయిన అయోధ్యయాదవ్ హెచ్చరించారు.
ఊరూరా శవయాత్ర.. దిష్టిబొమ్మల దహనాలు
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీల పరిధిలోని ప్రతీ వార్డులోనూ గురువారం బీజేపీ దిష్టిబొమ్మలకు గొల్లకురుమలు శవయాత్ర యాత్ర తీశారు. మోదీ, రాజగోపాల్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేశారు. మోదీ మాటలు పట్టుకొని తమ బతుకులను ఆగం చేస్తున్న రాజగోపాల్‌రెడ్డికి తగిన బుద్ధి చెబుతామని గొల్లకురుమలు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీ కేంద్రాల్లో బీజేపీ, మోదీ, రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మలను కాలబెట్టారు. నియోజకవర్గంలోని 17,722 గొల్లకురుమల కుటుంబాలు రాజగోపాల్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మరోవైపు నేరుగా ఎదుర్కొనే శక్తిలేకే రాజగోపాల్‌రెడ్డి గొల్లకురుమల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.
ఓటమి భయంతోనే ఈసీకి బీజేపీ ఫిర్యాదు
మునుగోడు నియోజకవర్గంలోని గొల్లకురుమలకు రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడుతలో 5061 యూనిట్లకు 75 శాతం సబ్సిడీతో గొర్లను పంపిణీ చేసింది. ఇటీవల రెండో విడుతలో 12,661 యూనిట్లకు సంబంధించి గొల్లకురుమ లబ్ధిదారులకు నేరుగా వారివారి బ్యాంకు ఖాతాల్లో రూ.166 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. నియోజకవర్గంలోని గొల్లకుమరులంతా టీఆర్ఎస్కు విధేయంగా ఉన్నారు. తమ బతుకులు మార్చిన సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ఊరూరా యాదవ సోదరులు తీర్మానాలు చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు ఊరూరా క్షీరాభిషేకాలు చేశారు. నియోజకవర్గంలోని మొత్తం యాదవ సామాజికవర్గం టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు అండగా ఉన్నారని కన్నుకుట్టిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనవైపు ఉండరా? అని కక్ష పెంచుకొని, తన అనుచరులతో రెండో విడుత గొర్ల పంపిణీకి సంబంధించిన సొమ్మును ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని నియోజకవర్గంలోని గొల్లకురుమలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అణగదొక్కే ప్రయత్నం
ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమైన చర్య. ఈ ఉపఎన్నికల్లో నియోజకవర్గంలోని గొల్ల కురుమలంతా ఏకతాటి మీద నిలబడి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తాం. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా గొల్ల కురుమల అభివృద్ధికి సీఎం కేసీఆర్ గొర్రెల యూనిట్లు ఇస్తే, ఓర్వలేక మా సామాజిక వర్గాన్ని అణగదొక్కడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఎన్ని కుట్రలు చేసినా, మేం టీఆర్ఎస్ వెంటే ఉంటాం.
– తీర్పారి వెంకటేశ్వర్లు,యాదవ సంఘం నాయకుడు, మునుగోడు