ఉప్పల్, అక్టోబర్ 17 : ఉప్పల్ రింగ్‌రోడ్డులో చేపడుతున్న స్కైవాక్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తికావచ్చాయి. ప్రస్తుతం మెట్లు, లిఫ్ట్‌ల పనులు కొనసాగుతున్నాయి. వరంగల్-ఉప్పల్, సికింద్రాబాద్-ఉప్పల్, నాగోల్-ఉప్పల్, రామంతా పూర్-ఉప్పల్ రోడ్డు మార్గాలతోపాటు, మరోరెండు చోట్ల పాదచారులకు అనుగుణంగా లిఫ్ట్‌లు, మెట్ల మార్గాలను నిర్మిస్తున్నారు. వీటికి తోడుగా స్కైవాక్‌ను మెట్రో స్టేషన్‌కు కలుపుతున్నారు.
దీంతో రింగ్‌రోడ్డులో స్కైవాక్ ద్వారా మెట్రోస్టేషన్‌కు చేరుకోవచ్చు. ఉప్పల్ రింగ్‌రోడ్డులో రద్దీ దృష్ట్యా పాదచారులు రోడ్డు దాటడానికి నానా అవస్థలు పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సుమారు రూ.28 కోట్లతో స్కైవాక్ పనులు చేపడుతుంది. ఆకాశమా ర్గంలో నడకదారి.. రాబోయే రోజుల్లో ఉప్పల్ పాదచారులకు, ప్రయాణికులకు సమస్యలు తీర్చడంతోపాటు, ఆహ్లాదాన్ని పంచనుంది.
ఒక పక్క మెట్రోస్టేషన్, మెట్రోరైలు మార్గం, ఎలివేటేడ్ కారిడార్, వీటితోపాటు, సికింద్రాబాద్-నాగోల్ మార్గంలో ైఫ్లైఓవర్లు రావడంతో నడకదారిలో స్కైవాక్‌లో వెళ్లేవారికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. త్వరలోనే పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులు పూర్తి అయితే ఉప్పల్ రింగ్‌రోడ్డుకు సరికొత్త అందాలు రానున్నాయి.