సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) :నగరంలో ఉత్పత్తయ్యే మురుగు నీటిని వంద శాతం శుద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.3866 కోట్లతో 1259 ఎంఎల్డీల సామర్థ్యంతో 31 చోట్ల కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను నిర్మిస్తున్నది. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ మురుగునీటి శుద్ధి ప్లాంట్లు వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు పనుల్లో వేగం పెంచారు. జలమండలి పరిధిలో ప్రస్తుతం 1950 ఎంఎల్డీల (జీహెచ్ఎంసీ పరిధిలో 1650, ఓఆర్ఆర్ పరిధిలో 300 ఎంఎల్డీ) మేర మురుగు ఉత్పత్తి అవుతున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజువారిగా వెలువడుతున్న 1650 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో జలమండలి 25 ఎస్టీపీల్లో 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధిచేస్తున్నది. అంటే ఉత్పత్తి అవుతున్న మురుగులో 46.8శాతం శుద్ధి అవుతున్నది. మరో 878 మిలియన్ లీటర్ల మురుగు నీరు ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే మూసీలో కలుస్తున్నది. ఈనేపథ్యంలో అందుబాటులోకి రాబోయే 31ఎస్టీపీలతో వంద శాతం మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు.
త్వరలోనే టెండర్లకు ఆహ్వానం
అయితే 2036 సంవత్సరం నాటికి 2814 ఎంఎల్డీ, 2051 నాటికి 3715 ఎంఎల్డీ మురుగు ఉత్పత్తి అవుతుందని సీవరేజీ మాస్టర్‌ప్లాన్ రూపకల్పనలో భాగంగా ముంబైకి చెందిన షా కన్సల్టెన్సీ ప్రతిపాదించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీలకు ప్రాధాన్యత ఇచ్చి పనులను దాదాపు 75శాతం మేర దాటించి చివరి దశలోకి చేర్చారు. ఈ సమయంలో రెండో విడత ప్రాధాన్యతగా తాజాగా ఓఆర్ఆర్ పరిధిలో 30 ఎస్టీపీ (సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్)లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇటీవల ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 30 చోట్ల స్థలాల ఎంపికకు సంబంధించి మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేస్తున్నారు. త్వరలోనే స్థలాలను గుర్తించి దాదాపు మరో 1200 ఎంఎల్డీ సామర్థ్యంతో జరిగే ఈ ఎస్టీపీ పనులకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ పనులను కూడా ముందుకొచ్చే సంస్థలు 60 శాతం నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. మరో 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నది.
వేగంగా ప్యాకేజీ -1, 3 పనులు
ప్యాకేజీ-1, 3 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల పనులు ప్రారంభంకావాల్సి ఉంది. న్యాయపరమైన చిక్కులను త్వరలోనే అధిగమించి పనులు చేపడుతామని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి వంద శాతం మేర ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
డిసెంబర్ నాటికి నాలుగు ఎస్టీపీలు అందుబాటులోకి..!
ఎస్టీపీల నిర్మాణం ద్వారా ప్రతి రోజూ 1950 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) మురుగునీటిని 100శాతం శుద్ధి చేయవచ్చన్న అంచనాతో జలమండలి ఆధ్వర్యంలో పనులను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగానే మూడు ప్యాకేజీల వారీగా పనులను విభజించి పనులు జరుపుతుండగా ప్యాకేజీ-2 పనులు తుది దశకు చేరాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్యాకేజీలోని నాలుగు ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువచ్చి 480.50 ఎంఎల్డీల మేర అదనంగా మురుగును శుద్ధి చేసి మూసీలోకి వదలనున్నారు.