సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ):వస్తువులు పంచిపెడుతాం… అవసరాన్ని బట్టి డబ్బులు ఇచ్చి ఆదుకుంటాం.. వీటి వల్ల సాయం చేశామన్న తృప్తి ఉంటుంది. కానీ.. అవయవదానంతో కొందరికి జీవితాన్ని ఇవ్వొచ్చు. ఒక్కరు పదుల సంఖ్యలో ప్రాణాలను నిలబెట్టవచ్చు. అందుకే అన్ని దానాల్లో కంటే.. అవయవదానమే గొప్పదంటారు. గతంతో పోలిస్తే.. ప్రజల్లో సైతం అవగాహన పెరిగి.. అవయవదానానికి ముందుకొస్తున్నారు. జీవన్మృతుడి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. అవయవదానానికి ముందుకు వచ్చేలా చేయడంలో జీవన్‌దాన్ విశేష కృషి చేస్తున్నది. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి సకాలంలో అవయవాల మార్పిడి చేయించి.. వారికి పునర్జన్మను ప్రసాదిస్తున్నది.
మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే.. అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రధాన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ఏదైనా కారణాల వల్ల విఫలమైతే రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. దెబ్బతిన్న వాటిని తొలగించి..వాటి స్థానంలో ఇతరుల అవయవాన్ని మార్పిడి చేయడం ద్వారా బాధితుడి ప్రాణాలను కాపాడవచ్చు. కొన్ని అవయవాలు (లైవ్ డోనర్)రక్త సంబంధీకుల నుంచి మార్పిడి చేసుకునే వీలుండగా, 90 శాతం మాత్రం బ్రెయిన్ డెడ్‌కు గురైన జీవన్మృతుడి నుంచి మాత్రమే సేకరించాలి. అందుకోసం బ్రెయిన్‌డెడ్‌కు గురైన వ్యక్తి కుటుంబసభ్యుల అంగీకారం అవసరం. గతంలో అవయవదానం చేయాలంటే ప్రజల్లో అనేక రకాల అపోహలు ఉండేవి. దాని ఆవశక్యతను తెలిపి.. అపోహలను తొలగించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం జీవన్‌దాన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నది. జీవన్మృతుడి కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో అవయవదాతలు ముందుకొస్తున్నారు.
500 మందికి..
ఈ సంవత్సరం గడిచిన 9 నెలల్లో 595 మందికి జీవన్‌దాన్ ద్వారా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు చేసి.. పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 161 మంది బ్రెయిన్‌డెడ్‌కు గురవ్వగా, వారి నుంచి 595 అవయవాలను సేకరించినట్లు జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత వెల్లడించారు. కాగా, అవయవాలు దెబ్బతిని ప్రాణపాయ స్థితిలో ఉన్న రోగుల ప్రాణాలను కాపాడే ఉద్దేశ్యంతో అన్ని ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ కమిటీలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియా, నిమ్స్‌లో మాత్రమే బ్రెయిన్‌డెడ్ నిర్ధారణ జరుగుతుండగా, ఇక నుంచి అన్ని దవాఖానల్లో ఈ ప్రక్రియ
ఉండనున్నది.
పారదర్శకంగా..
అవయవాల సేకరణ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ విషయంలో పూర్తి పారదర్శకత ఉంటుంది. అవయవాలను సేకరించే ముందు నుంచి సేకరణ పూర్తయి.. దాత మృతదేహాన్ని తరలించే వరకు జీవన్‌దాన్ బృందం జీవన్మృతుడి కుటుంబసభ్యులతోనే ఉంటుంది. అవయవాల సేకరణ, మార్పిడిలో జీవన్‌దాన్ పాత్ర ఎంతో కీలకమైంది. జీవన్‌దాన్‌లో అవయవ దానం అనేది పూర్తిగా ఆన్లైన్ పద్ధతిలో సాగుతుంది. దీంట్లో ఎలాంటి అవకతవకలు జరిగే ఆస్కారం లేదు.
-డాక్టర్ స్వర్ణలత, కో ఆర్డినేటర్, జీవన్‌దాన్