శంషాబాద్ రూరల్, అక్టోబర్ 16: మండలంలోని కేబిదొడ్డిలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామంలో డ్వాక్రా భవనానికి గతంలో రూ.6 లక్షలతో జిల్లా పరిషత్ నిధులు మంజూరు కాగా భవన నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో భవన నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు కేటాయించాలని సర్పంచ్ దండు ఇస్తారి, గ్రామస్తులు కోరడంతో స్పందించిన ఎంపీపీ జయమ్మశ్రీనివాస్ మండల పరిషత్ నిధుల నుంచి రూ.3 లక్షలు కేటాయించడంతో భవన నిర్మాణం పూర్తి చేశారు. డ్వాక్రా భవనం లేక గ్రామంలోని మహిళలు ప్రతి నెల సమావేశం కావడం కోసం ఎదో ఒక చోట కూర్చోని అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళ ఇబ్బందులను తొలగించడం కోసం భవనం పూర్తి చేయడం కోసం నిధులు తీసుకువచ్చి పనులు పూర్తి చేశామని సర్పంచ్ దండుఇస్తారి తెలిపారు. గ్రామంలో ఇప్పటీకే ఎస్సీ కమ్యూనిటీహాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించాం. సీసీరోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించామన్నారు.
మహిళా సంఘాలకు ఇబ్బందులు లేకుండా చేస్తాం
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం వారికి రుణా లు ఇచ్చి అభివృద్ధి చేస్తుందని, మహిళలు ప్రతి నెల సమావేశం కావడం కోసం వారికి ప్రత్యేక భవనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.3 లక్షల మండల పరిషత్ నిధులు కేటాయించడంతో భవన నిర్మాణం పూర్తి చేశాం. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆధ్వర్యంలో త్వరలో భవనాన్ని ప్రారంభించి మహిళలకు అప్పగిస్తాం.
– జయమ్మ, ఎంపీపీ, శంషాబాద్
మా సమస్య తీరనుంది
మా చిన్నగ్రామంలో ఐదు గ్రూపులకుగాను 50 మంది మహిళలు ఉన్నారు. మహిళలు సమావేశం కావడం కోసం మాకు ప్రత్యేక భవనం లేక ఇబ్బందులు పడుతున్నం. మా సమస్యను గుర్తించి భవన నిర్మాణం పూర్తి చేశారు. ఏండ్ల నాటి సమస్య తీరనుంది.
– గోసుల సుమిత్ర, స్థానిక మహిళ