బంజారాహిల్స్,అక్టోబర్ 16: ప్రతియేటా కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ మురుగు సమస్యలను పరిష్కరించేందుకు జలమండలితో పాటు జీహెచ్ఎంసీ కొత్తగా నాలాలను నిర్మిస్తోంది. గతంలో జనాభాకు అనుగుణంగా కట్టిన నాలాల్లో సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త లైన్లు వేస్తూ మురుగు సమస్యలు తలెత్తకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో నియోజకవర్గంలో మ్యాన్‌హోళ్లు పొంగకుండా సుమారు రూ.10 నుంచి 15 కోట్ల మేర నిధులు ఖర్చు చేస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రాంతాల్లో మురుగు సమస్యలు బయటపడుతూనే ఉన్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు బస్తీలు ,కాలనీల్లో నిత్యం సుమారు 200 నుంచి 250 దాకా మ్యాన్‌హోళ్లలో డ్రైనేజీ పొంగుతుందంటూ ఫిర్యాదులు అందుతుంటాయి.వాటిని పరిష్కరించేందుకు రంగంలోకి దిగే జలమండలి సిబ్బందికి నాలాల్లో మొత్తం ఫ్లాస్టిక్ కవర్లు, వాడిపారేసిన బట్టలు, దవాఖానలో వ్యర్థాలు, పిల్లలకు సంబంధించిన డైపర్లు, పరుపులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. మురుగునీరు ప్రవహించాల్సిన నాలాల్లో ప్రజలు బాధ్యతారహితంగా పారవేస్తున్న వ్యర్థాలతో తరుచూ మ్యాన్‌హోళ్లు పొంగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఖాళీ డ్రమ్ములు, సోఫా సెట్లను కూడా నాలాల్లో వేయడం గమనిస్తున్న జలమండలి సిబ్బంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో రోజంతా నాలాలు, డ్రైనేజీలను శుభ్రం చేస్తుంటామని, నాలాల్లో వ్యర్థాలు వేయవద్దని చెప్పినా వినకుండా కొంతమంది వ్యవహరిస్తున్న తీరుతో ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన మురుగు సమస్యలు ఎదురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలాల్లో వ్యర్థాలు వేయొద్దు
మురుగునీరు సాఫీగా వెళ్లేలా చూసేందుకు జలమండలి సిబ్బంది నిరంతరం కృషి చేస్తుంటారు. ఒక్క చోట మ్యాన్‌హోల్ నిండిందంటే ఆ రోడ్డుమొత్తం మురుగుమయం అవుతుంది. నిత్యం మురుగు సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తుంటాయి. మ్యాన్‌హోళ్లలో, నాలాల్లో అడ్డంకులు ఏర్పడడమే మురుగు సమస్యకు ప్రధాన కారణం. నాలాల్లో చెత్తాచెదారం వేయకుండా జనం బాధ్యతగా ఉండాలి. ప్రజల్లో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
-హరిశంకర్, జలమండలి జనరల్ మేనేజర్