మియాపూర్, అక్టోబర్ 16 : పాలక పరిశోధకుడిగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చిరస్మరణీయుడిగా చరిత్రలో నిలిచిపోతారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ప్రతి ఒక్కరు ఉత్తమ భవిష్యత్‌ను పొందేందుకు కలలు కనాలని, వాటిని నిజం చేసుకునేందుకు తగు కృషి చేయాలని పిలుపునిచ్చిన మహానుభావుడన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ చౌరస్తాలో ఏర్పాటు చేసిన డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహాన్ని కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్‌తో కలిసి విప్ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం విప్ మాట్లాడుతూ.. పేదరికం అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు ఏమాత్రం ఆటంకం కాదనేందుకు కలాం ఉత్తమ నిదర్శనమన్నారు. మిసైన్ మ్యాన్‌గా పిలవబడే కలాం క్షిపణి వాహన ప్రయోగ సాంకేతికకు చేసిన కృషి గొప్పదన్నారు. పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతిగా ఎదిగి ఎందరికో ఆయన ఆదర్శంగా నిలిచారని, యువత కలాంను ఆదర్శంగా తీసుకోవాలని విప్ గాంధీ పిలుపునిచ్చారు. మహనీయుడు కలాం విగ్రహ ఏర్పాటు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు అనీల్‌రెడ్డి, గణేశ్, పెద్ద భాస్కర్‌రావు, రామకృష్ణ గౌడ్, రాజు, ముస్లీం మైనార్టీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సమద్, ఖాజా, ఎంఏ కరీం, షౌకత్ అలీ మున్నా, గౌస్, నజీర్ , రెహ్మాన్, ఖైసర్, ఇస్మాయిల్, ఖాజా, సయీద్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం ప్రారంభం..
మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండలో ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈద్గా ఆవరణలో క్యాన్సర్ బాధితుల సహాయార్థం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కార్పొరేటర్ వెంకటేశ్ గౌడ్‌తో కలిసి విప్ గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజున జరుపుకునే మిలాద్ ఉన్ నబీ సందర్భంగా అత్యవసర పరిస్థితులలో ఉన్న బాధితులను ఆదుకునేందుకు ప్రాణదానం చేసేందుకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించటం అభినందనీయమన్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ ప్రాణదానం చేసేందుకు శిబిరాన్ని నిర్వహించి లౌకికత్వం చాటుకోవటం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందించారు. నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, ముస్లిం మైనార్టీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
దళితుల కుటుంబాల్లో వెలుగులు..
ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ శంషీగూడకు చెందిన అంజలికి దళితబంధు పథకం కింద మంజూరైన కిరాణా దుకాణాన్ని విప్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుకు గురైన దళితుల జీవితాలలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. దళితబంధు పథకం ద్వారా వారికి ఇష్టమైన రంగాలలో స్వయం ఉపాధితో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు తోడ్పాటును అందిస్తున్నారన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని విప్ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గణేశ్, భద్రయ్య , కాశీనాథ్, శ్రీనివాస్, బాలరాజు, అమృతరాజు, ప్రీతి, సత్యనారాయణ, దేవేందర్ పాల్గొన్నారు.