సిటీబ్యూరో, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ) :శ్రీనివాసా గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. గోవిందా హరి..గోవిందా.. వేంకటరమణా గోవిందా అంటూ.. ఎన్టీఆర్ స్టేడియం గోవింద నామ స్మరణతో మార్మోగింది. శ్రీనివాసుడి వైభవోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉదయం వేదమంత్రోచ్ఛారణలు.. మంగళవాయిద్యాల మధ్య శ్రీవారికి పుష్పయాగాన్ని నిర్వహించారు. రాత్రి శ్రీనివాసుడి కల్యాణం ఆద్యంతం కనులపండువగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. కల్యాణ ఘట్టాన్ని కనులారా వీక్షించి.. స్వామి వారి కృపకు పాత్రులయ్యారు.
మామిడి తోరణాలు..మేళ తాళాలు..మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ మధ్య శ్రీ వేంకటేశ్వరుని కల్యాణోత్సవం శనివారం సాయంత్రం ఎన్టీఆర్ స్టేడియంలో వైభవంగా జరిగింది. వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకురాగా..సాయంత్రం 6.30 గంటలకు పెండ్లి వేడుక ప్రారంభమైంది. స్వామివారి కల్యాణాన్ని భక్తజనులు కనులారా వీక్షించి తరించారు. శనివారం సాయంత్రం జరిగిన కల్యాణ ఘట్టంతో గత ఐదు రోజులుగా ఎన్టీఆర్ స్టేడియంలో టిటిడి చేపట్టి శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు తెరపడింది.
కల్యాణోత్సవంలో ప్రధాన ఘట్టాలు :
కల్యాణంలో పాల్గొన్న ప్రముఖులు..
శ్రీనివాసుని కల్యాణోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి దంపతులు, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఈవో ఏవీ ధర్మారెడ్డి, దాతలు హర్షవర్ధన్, ఎస్ఎస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్డారెడ్డి పాల్గొన్నారు.
భక్తుల సందడి..
ఎన్టీఆర్ స్టేడియంలో టిటిడి ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వరుని నమూనా ఆలయం శనివారం భక్తజన సంద్రంగా మారింది. వైభవోత్సవాలు చివరి రోజు ..సెలవు దినం కావడంతో నగరం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ప్రాంగణంలో ఎటుచూసినా భక్తులే కనిపించారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచిఉండి మరీ స్వామిని దర్శించుకున్నారు.
వేడుకగా పుష్పయాగం..
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలలో చివరి రోజు శనివారం ఉదయం శ్రీవారికి పుష్పయాగం నిర్వహించారు. సుగంధాల్ని వెదజల్లే తులసి, చామంతి, గన్నేరు, మొగలి, సంపంగి, రోజా, కలువలు తదితర 12 రకాల రంగు రంగుల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో కలిపి మూడు టన్నుల పుష్పాలతో అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పారాధనను వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 108 సార్లు విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠించి పుష్పాలకు అధిపతి అయిన పుల్లుడు అనే దేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. భూమాతను ప్రసన్నం చేసుకునేందుకు నిర్వహించే ఈ పుష్పయాగంతో ప్రకృతిమాత పులకించి ఎలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా స్వామివారి కరుణిస్తారని నమ్మకం. వేద పండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించి చివరగా నక్షత్ర హారతి ఇచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.
వేడుకల్లో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, దాతలు హర్షవర్ధన్, ఎస్ఎస్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, వీజీవో మనోహర్, ధార్మిక కార్యక్రమాల అధికారి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ, ఏఈవోలు జగన్మోహనాచార్యులు, పార్థసారధి, శ్రీరాములు పాల్గొన్నారు.
ఉదయం జరిగిన పూజలు