మేడ్చల్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల మున్సిపాలిటీలలో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది. మున్సిపాలిటీలను క్లీన్ అండ్ గ్రీన్ సిటీలుగా తీర్చిదిద్దుతున్న క్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలలో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా వివిధ ఏజెన్సీలకు ప్రభుత్వం అప్పగించింది. ఇప్పటికే పీర్జాదిగూడ, కొంపల్లి, మేడ్చల్‌లలో సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలు ఉన్నాయి. మున్సిపాలిటీలలో ఉత్పత్తి అయ్యే తడి-పొడి చెత్తల ఆధారంగా ఎన్ని అవసరం అవుతాయో గుర్తించి సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
క్లీన్ అండ్ గ్రీన్ సిటీలుగా తీర్చిదిద్దుతున్న క్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలుస్తుంది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 38 టన్నుల తడి-పొడి చెత్త ద్వారా 500 కిలోల ఎరువులను తయారు చేస్తున్నారు. కార్పొరేషన్ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి గృహాలలోనే తడి, పొడి చెత్తలను వేర్వురుగా చేయిస్తున్నారు. చెత్త నుంచి తయారైన సేంద్రియ ఎరువులను కార్పొరేషన్ పరిధిలోని పార్క్‌లు, హరితహారంలో నాటిన మొక్కలు, పట్టణ పకృతి వనాలలో వినియోగిస్తున్నారు. రూఫ్ గార్డెన్లు నిర్వహిస్తున్న ఇంటి యజమానులకు సేంద్రియ ఎరువులను ఉచితంగా సరఫరా చేస్తున్నారు. అవసరమైన వారికి సేంద్రియ ఎరవులు అందించేందుకు 4 టన్నుల ఎరువులను అందుబాటులో ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్, కొంపల్లి మున్సిపాలిటీలలో తయారవుతున్న సేంద్రియ ఎరువులను హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగిస్తున్నారు.
తడి, పొడి చెత్తను వేరుచేస్తున్నాం
పీర్జాదిగూడలో చెత్త ద్వారా 500 కిలోల సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. కార్పొరేషన్ పరిధిలో తడి, పొడి చెత్తను 100 శాతం వేరు చేస్తున్నాం. చెత్తతో తయారు చేసిన సేంద్రియ ఎరువును పార్క్‌లు, హరితహారంలో నాటిన మొక్కలకు వినియోగిస్తున్నాం. రోడ్లపై తడి, పొడి చెత్తల డబ్బాలను ఏర్పాటు చేసి చెత్త వేయకుండా చూస్తున్నాం. చెత్త సేకరణకు 75 ఆటోలు వినియోగిస్తూ ప్రతి ఆటోకు జియో ట్యాగింగ్ చేసి కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నాం.
– జక్క వెంకట్‌రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్