సిటీబ్యూరో, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): అమీర్‌పేట్ నుంచి ఐటీ కారిడార్‌లోని రాయిదుర్గం వరకు మెట్రో రైళ్లను షార్ట్ లూప్ విధానంలో ప్రతి 2 నిమిషాలకు ఒక రైలును నడిపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగుల రద్దీని తట్టుకునేలా లూప్ విధానం నిర్ణయించిన సమయాల్లో అమలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. మొత్తం మెట్రో రైలు నెట్ వర్క్‌లో ఏ సమయంలో రద్దీ ఎలా ఉంటుందన్న దానిపై వారం, పది రోజుల పాటు అధ్యయనం చేసిన తర్వాత చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం విధానం నుంచి క్రమంగా ఆఫీసులకు వచ్చి (రిటర్న్ టు ఆఫీస్) పనిచేస్తుండడంతో రద్దీ మరింతగా పెరుగుతున్నది. కరోనా మహమ్మారికి ముందు నగరంలో మెట్రో రైళ్లు ఐటీ ఉద్యోగులతో సందడిగా ఉండేవి. ప్రసుత్తం అలాంటి రద్దీ నాగోల్-రాయిదుర్గం, ఎల్బీనగర్ మియాపూర్ కారిడార్లలో కనిపిస్తున్నది. రద్దీ అధికంగా ఉండడంతో రైళ్లలో ప్రయాణం చేసే వారు సోషల్ మీడియాలో రైళ్లను పెంచాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో అధికారులు క్షేత్ర స్థాయిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు, ఆ తర్వాత వీకెండ్లో శని,ఆదివారాల్లో వేర్వేరుగా నిర్ణీత మార్గాల్లో రద్దీపై అధ్యయనం చేస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి ఆర్టీఓ (రిటర్న్ టు ఆఫీస్) విధానాన్ని ఐటీ ప్రధాన కంపెనీలు అమలు చేస్తున్నాయి. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. రద్దీ సమయాల్లో ఒకేసారి వేలాది ఐటీ ఉద్యోగులు పై మూడు మెట్రో స్టేషన్లలో దిగుతుండటంతో సందడి నెలకొంటున్నది.
అమీర్‌పేట్ ఇంటర్చేంజ్ నుంచే రద్దీ అధికం..
నగరంలోని మెట్రో రైలు నెట్ వర్క్‌లో అమీర్‌పేట్ ఇంటర్చేంజ్ అత్యంత కీలకమైంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1, నాగోల్ నుంచి రాయిదుర్గం వరకు ఉన్న కారిడార్-3లో అమీర్‌పేట్ ఇంటర్చేంజ్లోనే పెద్ద మొత్తంలో ప్రయాణికులు రైళ్లను మారుతుంటారు. రద్దీకి అనుగుణంగా రైళ్లను నడిపిందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.