సిటీబ్యూరో, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు ఎన్టీఆర్ స్టేడియంలో కనుల పండువగా సాగుతున్నాయి. నాలుగో రోజు శుక్రవారం శ్రీవారికి అభిషేకం నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని కనులారా చూసి భక్తులు తరించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామాలకు సంబంధించిన పుస్తకాలను అందజేశారు.పవిత్ర జలాలతో అభిషేకం శ్రీవారి నమూనా ఆలయంలో ఉదయం 8.30 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. పునుగు, కస్తూరి, జవ్వాది తదితర సుగంధ పరిమళాలతో కూడిన పవిత్ర జలాలతో శ్రీవారికి అభిషేకం నిర్వహించగా..శ్రీవారి వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మికి పసుపుతో అభిషేకం చేశారు. తిలకించిన భక్తులు తన్మయత్వం పొందారు.
స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, గోవింద నామాలతో కూడిన పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు మోహనరంగాచార్యులు, బోర్డు సభ్యులు రాములు, దాతలు హర్షవర్ధన్, ఎస్‌ఎస్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, విజివో మనోహర్, ధార్మిక ప్రోగ్రామ్స్ అధికారి విజయలక్ష్మి, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, సాయంకాలం నిర్వహించిన సహస్రదీపాలంకార సేవలో శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వైభవోత్సవాల్లో చివరి రోజైన శనివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు కల్యాణానికి సంబంధించిన తంతు కొనసాగనున్నది. అంతకుముందు ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు పుష్పయాగాన్ని నిర్వహించనున్నారు.