సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ప్రపంచం అంతా స్మార్ట్‌గా మారిపోతుంది. ప్రతి వస్తువూ స్మార్ట్‌గానే ఉంటుంది. ఇందులో భాగంగా ఇండ్లు కూడా స్మార్ట్‌గానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న స్మార్ట్ ఇండ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇంట్లో టీవీ ఆన్ చేయాలన్నా.. ఏసీ టెంపరేచర్ కంట్రోల్ చేయాలన్నా..? ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ వాటంతట అవే పనిచేయాలన్నా లేదా ఆగిపోవాలన్నా ఫింగర్ టిప్స్ మీదనే జరిగిపోతున్నాయి. ఎలాంటి శ్రమ లేకుండా ఇంటిని నియంత్రించే ఆటోమేషన్ టెక్నాలజీ హైదరాబాద్‌లోనూ క్రమంగా పెరుగుతున్నది. ఒకప్పుడు విదేశాలు, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కనిపించే ఆటోమేటేడ్ ఇండ్లు క్రమంగా హైదరాబాద్ నగరంలోనూ సర్వసాధారణమైపోతున్నాయి.
గచ్చిబౌలిలో నివాసముండే సుజీత్.. ఆఫీస్ హడావుడిలో పడి ఏసీని ఆపేయడం మరిచిపోయాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటి మతిమరుపు ఘటనలు తరుచుగా జరగడంతో మొబైల్ ఆధారిత సాంకేతికత ద్వారా ఇంట్లో ఏసీని నియంత్రించేలా ఆటోమేషన్ సెట్ చేసుకున్నాడు.
కిస్మత్‌పురాలోని గేటెడ్ కమ్యూనిటీలో ఓ విల్లా ఆటోమేషన్ వ్యవస్థతో అనుసంధానం చేయబడింది. డోర్ తీసి ఇంట్లో అడుగు పెట్టగానే హాల్లోని లైట్, ఏసీతోపాటు కాసేపు సేద తీరేలా టీవీ కూడా వాటంతట అవే పనిచేయడం మొదలుపెడతాయి. ఇంట్లోకి వెళ్తూ వాయిస్ కమాండ్ ఫీచర్ ద్వారా టీవీ, ఏసీ, లైట్ అన్ని ఆఫ్ చేయమనగానే ఆగిపోతాయి.
మాదాపూర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఒంటరిగా ఉండే సీనియర్ సిటిజన్స్‌కు ప్రత్యేక సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఉండేలా సాయం కోసం ఒక్క బటన్ నొక్కితే సంబంధిత సిబ్బందికి సమాచారాన్ని చేరవేస్తుంది. మెడికల్ అలర్ట్ పేరిట ఏర్పాటు చేసిన ఈ బటన్ సాయంతో డాక్టర్ నుంచి మొదలుకుంటే దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బందిని కాల్స్, మెసేజ్ రూపంలో అలర్ట్ చేస్తుంది.
జూబ్లీహిల్స్‌లోని ఓ సంపన్నుడి ఇంటి ప్రధాన గేటు ఆటోమేషన్తో అనుసంధానం చేయబడింది. ఇంట్లోకి వచ్చే వాహనాల ఆధారంగా పనిచేస్తుంది. ప్రధాన గేటు ముందుకు కారు రాగానే ఎవరూ తెరవకపోయినా.. డోర్ ఓపెన్ అవుతుంది. ఇందులోనే ముందుగా కారు నంబర్ ఫీడ్ చేసి ఉంచితే.. ఆ కారు ఎప్పుడు వచ్చినా.. నెంబర్ స్కానింగ్‌తో తెరుచుకోవడం, క్లోజ్ అవడం జరిగిపోతుంది.
మార్కెట్ ట్రెండ్ నివేదిక ప్రకారం హోం ఆటోమేషన్‌లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉన్నది. పుణే 15 శాతం, ఢిల్లీ 13 శాతం, ముంబై 12శాతంతో ముందు వరుసలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ఏటా రెండు శాతం వృద్ధి చెందుతున్నదని నివేదికలు చెబుతున్నాయి. నగరంలో ప్రస్తుతం హైరైజ్ భవనాలు, లగ్జరీ విల్లాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇండ్ల ఆటోమేషన్‌కు ఆదరణ పెరుగుతున్నది.
మార్కెట్లో రూ.50వేల నుంచి రూ. 2.5లక్షల రేంజ్లో దొరికే ఈ డివైజ్‌తో ఇంట్లోని ఫ్యాన్లు, ఏసీ, టీవీ, కంప్యూటర్, స్పీకర్, లైట్లను మానిటరింగ్ చేసుకునే వీలు ఉంటుంది. ఫోన్‌తో అనుసంధానం చేసుకున్న తర్వాత కూర్చున్న చోట నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. సిండర్ లాంటి బ్రాండెడ్ కంపెనీలు కూడా ఈ తరహా ప్రొడక్టులను అందిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇంట్లోనే ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఆప్టిమైజ్ చేసుకునే వీలు ఉంటుంది.
ఇంటి ప్రధాన గేటును ఓపెన్ చేసేందుకు వినియోగించే ఈ డివైజ్ ఖరీదు రూ.25-30వేల వరకు ఉంటుంది. సెక్యూరిటీ విషయంలో ఇంకో మనిషితో పని లేకుండానే గేట్లను ఓపెన్ చేయడం, మూసివేయడం చేస్తుంది. ఇంట్లోని వాహనాలను ఒక్కసారి రికార్డు చేసి పెడితే.. ఆ కార్లు వచ్చినప్పుడు కెమెరాల ద్వారా గుర్తించి గేట్ తెరుచుకుంటుంది. వీటిలోనే రూ.10వేల లోపు తక్కువ ఖర్చులో ఐఆర్-సెన్సార్‌తో పనిచేసే డోర్ డివైజ్‌లూ ఉంటాయి. వీటితో ఇంటి ముందు ఏదైనా వాహనం నిలిపితే డోర్ తెరుచుకుంటుంది.
స్మోక్ డిటెక్టర్‌గా పిలిచే ఈ డివైజ్ సాయంతో ఇంటి లోపల ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అలర్ట్ చేస్తుంది. పొగ, కార్బన్ మోనాక్సైడ్, గ్యాస్ లికేజీలను పసిగట్టి అలారం మోగిస్తుంది. కొన్ని లగ్జరీ అపార్టుమెంట్లలోని మోడ్రన్ కిచెన్లలో ఇన్ బిల్ట్గానే వీటిని అందజేస్తుండగా.. రూ.1500-6వేల రేంజ్లో ఆన్లైన్, స్మార్ట్ కిచెన్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద దొరుకుతుంది. వీటికే మంటలను నియంత్రించేలా ఆటోమేటిక్ కెమికల్ సిలిండర్లను అటాచ్ చేసుకునే వీలు ఉంటుంది.
స్మార్ట్ డోర్ లాకింగ్ డివైజ్‌తో ఇంటి తలపులను పకడ్బందీగా నియంత్రించుకునే వీలు ఉంటుంది. మార్కెట్లో రూ.5వేలు-18వేల వరకు లభ్యం అవుతుండగా.. సెన్సార్, ఫింగర్ ప్రింట్, నంబర్ లాకింగ్ వెర్షన్లతో పనిచేస్తుంది. ఫింగర్ ప్రింట్, ఫేస్ సెన్సార్లతో పనిచేసే డివైజ్‌లలో ఇంట్లోని 3-5 ముఖాల డేటాను నిక్షిప్తం చేసుకుని పనిచేస్తుంది. రికార్డ్ చేసి డేటా ఆధారంగానే డోర్ ఓపెన్ కావడం, మూసుకోవడం జరుగుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీతో పనిచేసే వీడియో ఫీచర్ కాస్తా ఎక్కువ ధరలో దొరుకుతుంది.
స్పెషల్ ఫీచర్లు ఉండే స్మార్ట్ హోంలకు సిటీలో డిమాండ్ పెరుగుతున్నది. ప్రస్తుతానికి హైదరాబాద్ మార్కెట్లో ఫుల్లీ, సెమీ ఆటోమేషన్ వేరియంట్లలో టెక్నాలజీ అందుబాటులో ఉంది. రూ.2లక్షల నుంచి రూ.15లక్షల వ్యయంతో ఒక డబుల్ బెడ్రూం ఇంటిని స్మార్ట్ అండ్ సెక్యూర్‌గా మార్చుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు వివరించారు. సిటీలో లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ భవనాలు విపరీతంగా పెరుగుతున్నట్లుగానే హోం ఆటోమేషన్‌కు డిమాండ్ ఉన్నదని తెలుపుతున్నారు. ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో డోర్ లాకింగ్, సీసీ కెమెరా రికార్డింగ్, లైటింగ్ ఆటోమేషన్ వంటి కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారని స్మార్ట్ హోం అప్లికేషన్ సేవలు అందించే సంస్థలు వెల్లడించాయి.
నగరంలోని గచ్చిబౌలి, నానక్ రాంగూడ, ఖాజాగూడ, కోకాపేట్, రాజేంద్రనగర్, కిస్మత్‌పురా, గండిపేట, తెల్లాపూర్, కొండాపూర్, అప్పా జంక్షన్, నార్సింగి, కోకాపేట్, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు చెందిన ఇండ్లలో హోం ఆటోమేషన్‌ను ఎక్కువగా ఏర్పాటు చేసుకుంటున్నారు. డబుల్ బెడ్రూం ఫ్లాటుకు రూ.కోటి నుంచి రెండున్నర కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన వారు హోం ఆటోమేషన్ కోసం రూ. 2-5లక్షలు ఖర్చు చేస్తున్నారని గచ్చిబౌలి కేంద్రంగా ఆటోబేస్డ్ హోం ఆటోమేషన్ సర్వీసులు అందించే ఓ సంస్థ మేనేజర్ జగదీశ్ శ్రీవాస్తవ తెలిపారు.