మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డులో అత్యంత విశాలమైన రహదారులు రూపుదిద్దుకుంటున్నాయి. ఆకాశమే హద్దుగా ఐటీ నగరం దూసుకుపోతుండటంతో ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. వెస్ట్ జోన్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నగరానికి తలమానికమైన ఓఆర్ఆర్ రోడ్లను ప్రస్తుతమున్న 12 లేన్లను 16 లేన్లుగా విస్తరిస్తున్నారు. నానక్ రామ్ గూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్ల వరకు రోడ్లను 16 లేన్లుగా నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జాతీయ రహదారులను తలదన్నేలా ఈ రోడ్ నెట్వర్క్ ఉండనున్నది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ కూడా అంతేవేగంగా సాగుతున్నది. హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా,ఐటీ కారిడార్‌కు అదనపు ఆకర్షణగా నిలిచిన ఔటర్ రింగు రోడ్డు ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఎంతగానో దోహదపడుతున్నది. అయితే దినదినం మహానగరం విస్తరిస్తుండగా.., ట్రాఫిక్ రద్దీ అంతకు రెట్టింపు స్థాయిలో పెరిగిపోతున్నది. దీంతో ప్రస్తుత అవసరాలే కాకుండా, భవిష్యత్ అంచనాలకు అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 లేన్లు (ఓఆర్ఆర్ ప్రధాన రోడ్డు 8 లేన్లు, ఇరువైపులా సర్వీస్ రోడ్లు 2 వరుసల్లో 4 లేన్లు) ఉన్న ఓఆర్ఆర్ను 16 లేన్లుగా విస్తరించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశాలను తలపించేలా నిర్మించేందుకు చర్యలు చేపట్టింది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ)
ఇప్పటికే గచ్చిబౌలి నుంచి నానక్‌రాంగూడ, నార్సింగి మీదుగా తెలంగాణ పోలీస్ అకాడమి వరకు, తెలంగాణ పోలీస్ అకాడమి నుంచి నార్సింగి, కోకాపేట మీదుగా కొల్లూరు వరకు ఔటర్ సర్వీసు రోడ్ల విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమి వరకు 8.50 కిలోమీటర్లు, నార్సింగి నుంచి కొల్లూరు వరకు 14.5 కిలోమీటర్ల వరకు ఓఆర్ఆర్ మొత్తం 16 లేన్లతో అందుబాటులోకి రానున్నది. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి.
ఇప్పటి వరకు గుర్తింపు పొందిన జాతీయ రహదారుల వెడల్పు సుమారు 100 అడుగుల నుంచి 120 అడుగుల వరకు ఉంటుంది. కాలానుగుణంగా దాని వెడల్పు పెంచుతూ కొత్తగా జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డును ఒకేసారి 450 అడుగులు (150 మీటర్లు)గా భూసేకరణ చేసి అందులో 8 వరసలతో ప్రధాన రహదారి, సెంట్రల్ మీడియన్, రైల్వే కారిడార్, ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్లు 2 వరుసల చొప్పున నిర్మించారు. అయితే భవిష్యత్ అవసరాల దృశ్యా సర్వీస్ రోడ్లను మరింత విస్తరించుకునేందుకు భూమి అందుబాటులో ఉంది. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) 12 లేన్లతో ఉన్న ఓఆర్ఆర్ను 16 లేన్లుగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లను మరో 4 లేన్లుగా విస్తరించేందుకు హెచ్ఎండీఏ అధికారులు నిర్మాణ పనులు మొదలు పెట్టారు. సుమారు రూ.330 కోట్లతో నాలుగు వరుసల్లో ఓఆర్ఆర్ సర్వీసు రోడ్ల విస్తరణతో పాటు అదే సమయంలో ఓఆర్ఆర్ లోపలి వైపు సోలార్‌రూఫ్ టాఫ్ సైకిల్ ట్రాక్‌ను సైతం నిర్మిస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో అత్యంత విశాలమైన రోడ్ నెట్ వర్క్ అందుబాటులోకి రానున్నది. విదేశాల్లోని రోడ్లను తలిపించేలా ఇక్కడి రోడ్లు హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులోకి రానున్నాయి.
ఐటీకారిడార్ను మరింత విస్తరించినా మరో 25 ఏళ్ల పాటు ఔటర్ రింగు రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు రాకుండా హెచ్ఎండీఏ పక్కా ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అవసరమైన చోట ఇంటర్‌చేంజ్‌లు,
సర్వీసు రోడ్ల విస్తరణ, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.
ఓఆర్ఆర్ సర్వీసు రోడ్లపై గణనీయంగా రద్దీ పెరగడంతో ఇప్పటికే నానక్‌రాంగూడ నుంచి నార్సింగిలోని మైహోం అవతార్ వరకు ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో వన్ వే ట్రాఫిక్ నిబంధనను అమలు చేస్తున్నారు. త్వరలోనే ఐటీ కారిడార్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డు మొత్తం 16 లేన్లతో అందుబాటులోకి రానున్నది.ఐటీ కారిడార్ నుంచే ఔటర్‌పైకి పెద్ద మొత్తంలో ట్రాఫిక్ గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా 19 ఇంటర్ చేంజ్‌లతో ఉన్న ఔటర్ రింగు రోడ్డు మీదకు వాహనాల రాకపోకలు ఐటీ కారిడార్‌లోని ఇంటర్‌చేంజ్‌ల నుంచే అత్యధికంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే వాహనాలు ప్రతి రోజు 70వేలకు పైగా ఉంటున్నాయి. అదేవిధంగా కోకాపేట, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, నానక్‌రాంగూడ, తెలంగాణ పోలీస్ అకాడమి, కొల్లూరు ఉండగా, ఈ ప్రాంతంలోనే మరో రెండు కొత్త ఇంటర్‌చేంజ్‌లను హెచ్ఎండీఏ నిర్మిస్తున్నది. నార్సింగి వద్ద ఇంటర్చేంజ్, కోకాపేట నియోపోలీస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ ట్రంపెట్‌ను నిర్మిస్తున్నది. ఇలా ఐటీ కారిడార్ పరిధిలోనే మొత్తం ఏడు ఇంటర్‌చేంజ్‌లను ఏర్పాటు చేస్తూ భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఓఆర్ఆర్ను విస్తరిస్తున్నది.