కుత్బుల్లాపూర్, అక్టోబర్14: రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాతోపాటు సినీ ఫక్కీలో బజాజ్ ఎలక్ట్రానిక్ షాపులో చోరీకి పాల్పడిన కేటుగాడిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం బాలానగర్ డీసీపీ సందీప్ గోనె నిందితుల వివరాలను వెల్లడించారు. కొంపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. ఆ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని, సీసీ కెమెరాలో లభించిన ఆధారాలతో ఈనెల 12న పేట్‌బషీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 13న సుచిత్ర చౌరస్తాలో తనిఖీలు చేస్తున్న పోలీసులకు నిందితుడు చిక్కాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు.
మెదక్ జిల్లా నందికంటి గ్రామానికి చెందిన సాజిద్ షేక్ (23), మహారాష్ట్రకు చెందిన కాంబ్లే తుకారం(19), వికారాబాద్ జిల్లాకు చెందిన దూదేకుల మోహిన్(24) పాత నేరస్తులు. ఈ ముగ్గురు కొంపల్లిలో నివాసముంటున్నారు. రాత్రి సమయంలో పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకెళ్లడంతో పాటు ఒంటరిగా వెళ్లే వారిని బెదిరింపులకు గురిచేస్తూ వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, ఇతర వస్తువులను లాక్కుంటున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్దనుంచి 8 ద్విచక్ర వాహనాలు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్‌లో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌కు రావల్కోల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వెంకటేశ్ నిత్యం వస్తువులను కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. కొనుగోలుదారు ముసుగులో షోరూమ్‌లోని నలువైపులా పరిశీలించి, రెక్కీ నిర్వహించాడు. రాత్రి సమయంలో షోరూమ్ వెనుక భాగం నుంచి చొరబడి విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగలించాడు. దొంగలించిన సొత్తును అమ్మకానికి తీసుకెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 40 స్మార్ట్ ఫోన్లు, మూడు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, సీఐ ప్రశాంత్, క్రైం డీఐ బి.లక్ష్మీనారాయణరెడ్డి, మేడ్చల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, క్రైమ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.