సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : పాఠశాలలు, కళాశాలల్లో నాణ్యమైన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులలో విద్యా క్రమశిక్షణ అలవాటు కావాలంటే.. విద్యార్థులందరూ తప్పకుండా స్కూల్, లేదా కాలేజీకి వెళ్లాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వం భావిస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో క్లాస్‌రూమ్‌కు దూరమై.. ఆన్లైన్ బోధనకు అలవాటు పడిన విద్యార్థులు ప్రస్తుతం కాలేజీలు, స్కూల్స్‌కు వెళ్లాలంటే బద్ధకిస్తున్నారు. దీనిని దూరం చేయాలంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలన్నింటిలో తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్‌ను అమలు చేయాలన్న సర్కారు నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు స్కూల్ యాజమాన్యాలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో పాటు ప్రైవేట్, ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో బయోమెట్రిక్ విధానంలో రోజు వారీ అటెండెన్స్‌ను తీసుకుంటున్నారు. దాని వల్ల ఆయా విద్యా సంస్థల్లో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. అలాగే పలు యూనివర్సిటీల పరిధిలో ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సులకు మాత్రం బయోమెట్రిక్ అమలు చేస్తున్నారు. అదే క్రమంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి అన్ని యూనివర్సిటీ కాలేజీలతో పాటు యూనివర్సిటీలకు అనుబంధంగా ఉండే ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ అమలు చేయనున్నట్లు ఆ యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అందుకు సంబంధించిన సర్వర్ల కెపాసిటీని కూడా మెరుగుపరుచుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.