సికింద్రాబాద్, అక్టోబర్ 14: పేదింటి ఆడ పడుచులకు షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలు ఒక వరమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. శుక్రవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో తిరుమలగిరి, మారేడ్‌పల్లి మండలాలకు చెందిన 22 మందికి షాదీముబారక్, నలుగురికి కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే సాయన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రుల ఆర్థిక కష్టాలను తీర్చడానికి సీఎం కేసీఆర్ షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలకు శ్రీకారం చుట్టి రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో పారదర్శక పాలన చేస్తూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీకి దేశంలో, రాష్ట్రంలో కాలం చెల్లిందని, ఆ పార్టీలకు కార్యకర్తలు కరువయ్యారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర కీలకం కానుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను బీజేపీ మోసం చేస్తుందని, రానున్న రోజుల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
లబ్ధిదారులందరూ సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తిరుమలగిరి మండల తహసీల్దార్ హసీనాబేగం, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, నళినికిరణ్, నేతలు నివేదిత, ముప్పిడి మధుకర్, టీఎన్ శ్రీనివాస్, చింతల వేణుగోపాల్‌రెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్, సదానంద్‌గౌడ్, పనస సంతోష్, తేజ్‌పాల్, భాస్కర్ ముదిరాజ్, మురళీయాదవ్, శంకర్, నిత్యానంద్, పరుశరామ్, ఆంజనేయులు, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.