బంజారాహిల్స్, అక్టోబర్ 14: తరచూ మ్యాన్‌హోళ్లు పొంగే ప్రాంతాలను హాట్‌స్పాట్స్‌గా గుర్తిస్తూ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పనులు చేపట్టేందుకు జలమండలి డివిజన్-6 అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటి దాకా మ్యాన్‌హోళ్లు పొంగిన ప్రాంతాల్లో యంత్రాల సహాయంతో అడ్డంకులను తొలగించి మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు జలమండలి సిబ్బంది ప్రయత్నించేవారు. ఎన్నిసార్లు శుభ్రం చేసినా ఏదో ఒక మ్యాన్‌హోల్‌లో అడ్డంకులు ఏర్పడి వీధి మొత్తం బురదమయం అయ్యేది. అయితే ఈ సమస్యను ముందుగానే గుర్తించి పరిష్కరించేందుకు జలమండలి జీఎం హరిశంకర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ విధానాన్ని ప్రయోగాత్మకంగా కొన్ని కీలక ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.
దీని ప్రకారం ఎక్కువగా మ్యాన్‌హోళ్లు పొంగే ప్రాంతాలను గుర్తిస్తున్నారు. డివిజన్ పరిధిలో సుమారు 250 నుంచి 300 దాకా ఎక్కువసార్లు మురుగునీటి సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జలమండలి సిబ్బంది 15 రోజులకోసారి ఆ లైన్లో పూడిక తీయడంతో పాటు ప్లాస్టిక్, ఇతర వ్యర్థ్ధాలు పేరుకుపోకుండా చూసేలా ప్రణాళిక రూపొందించారు. ఆ లైన్లలో ఎలాంటి సమస్యలు వచ్చినా సంబంధిత జలమండలి సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 300 హాట్‌స్పాట్స్‌లో 30 ప్రాంతాలను క్రిటికల్ పాయింట్స్‌గా గుర్తించారు. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్, బంజారాహిల్స్‌లోని సినీమ్యాక్స్ ఎదురుగా, సింగాడకుంట, బేగంపేట తదితర క్రిటికల్ పాయింట్స్‌లో నెలకు ఒకటి నుంచి రెండుసార్లు పూడిక, వ్యర్థ్ధాలను తొలగించగలిగితే మ్యాన్‌హోల్ పొంగే సమస్యలు గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని హాట్‌స్పాట్స్‌లో ప్రివెంటివ్ మెయింటెనెన్స్ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు.
మా డివిజన్ పరిధిలో ఎక్కువగా వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, ఇతర ఫుడ్ సంబంధిత వ్యాపారాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి వల్ల వెలువడే వ్యర్థ్ధాలు కొన్ని చోట్ల నేరుగా సీవరేజీ లైన్లలో కలుస్తున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా మ్యాన్‌హోళ్లు ఫిర్యాదులు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. సుమారు 300 వరకు ఇలాంటి హాట్‌స్పాట్స్ ఉన్నట్లు గుర్తించాం. ఆయా హాట్‌స్పాట్స్‌లో క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ పనులు చేస్తే మురుగు సమస్యలను చాలా వరకు తగ్గుతాయి. జలమండలి చేస్తున్న ప్రయత్నాలకు పౌరులు సైతం సహకరించాలి.
– హరిశంకర్, జలమండలి జీఎం