సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ) : కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) 12వ ఎడిషన్ హైదరాబాద్ ప్రాపర్టీ షో వచ్చే నెల 5, 6వ తేదీల్లో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలో టీఎస్ రెరా ఆమోదించడినవి మాత్రమే ప్రదర్శనలో ఉంటాయని, మొత్తం 45 స్టాల్స్‌లు అందుబాటులో ఉంటాయని క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని క్రెడాయ్ హైదరాబాద్ శాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రాపర్టీ షో వివరాలను వెల్లడించారు.
తొలిసారి నార్త్ హైదరాబాద్‌లో ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నామని, ఉత్తర హైదరాబాదీయుల కోసం కొంపల్లిలోని అస్పియస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలానగర్, కొంపల్లి, శామీర్‌పేట, అల్వాల్, మేడ్చల్, పటాన్చెరు, తదితర ప్రాంతాల్లోని ప్రాపర్టీలను ఒకే గూటి కిందకు తీసుకువస్తున్నట్లు రామకృష్ణారావు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, రిటైల్ కమర్షియల్ కాంప్లెక్స్‌ను ప్రదర్శించనున్నామని, చిన్న సైజు ప్లాట్ల నుంచి పెద్ద సైజు, ఓపెన్ స్థలాలు ఉంటాయని చెప్పారు.
వెస్ట్ జోన్‌కు సమాంతరంగా ఉత్తర వైపున అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని, ప్రభుత్వం గ్రిడ్ పాలసీని తీసుకువచ్చి తూర్పు, ఉత్తర కారిడార్లపై అధికంగా దృష్టి సారించిందని జనరల్ సెక్రటరీ వి. రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ లగ్జరీ ప్లాట్లకు డిమాండ్ బాగా పెరిగిందని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ యూత్ వింగ్ డి. వికాస్, జాయింట్ సెక్రటరీ శివరాజ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.