సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ప్రైవేట్ దవాఖానలకే పరిమితమైన దంత వైద్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దాదాపు అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులోకి వచ్చింది. గ్రేటర్ పరిధిలో ప్రతి ఏరియా దవాఖానల్లో దంత వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది వైద్య, ఆరోగ్యశాఖ. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ, నాంపల్లి, మలక్‌పేట ఏరియా హాస్పిటల్స్‌లో పూర్తిస్థాయి దంత చికిత్స అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. వీటితో పాటు ఇటీవలే ఖైరతాబాద్‌లోని 50 పడకల దవాఖాన, లాలాపేటలోని 50 పడకల దవాఖానలో సైతం దంత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో స్థానిక జిల్లా హాస్పిటల్లో సైతం దంత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
పూర్తిగా ఉచితం..
అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ దంత వైద్యశాల కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అందిస్తున్నది. ఈ దవాఖానల్లో ఖరీదైన రూట్‌కెనాల్ చికిత్సను పూర్తి ఉచితంగా చేస్తున్నారు. సాధారణంగా దంతాలకు సంబంధించిన నరాలు, రక్తకణాలు ఇన్ఫెక్షన్కు గురైనప్పుడు ఆ పన్ను పుచ్చిపోవడం లేదా దెబ్బతింటుంది. గతంలో అయితే ఈ సమస్య ఉన్నవారికి దెబ్బతిన్న పంటిని తొలగించేవారు. రూట్‌కెనాల్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్ఫెక్షన్కు గురైన పంటి భాగాన్ని తొలగించి, దెబ్బతిన్న నరాలు, రక్తకణాలకు చికిత్స చేసి ఆ పంటికి క్యాప్ వేస్తున్నామని కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ విభాగాధిపతి డాక్టర్ సర్జీవ్సింగ్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ దంత వైద్యశాలలో నిత్యం రూట్కెనాల్కు సంబంధించి 300 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని, వారిలో రోజుకు కనీసం 60 మందికి రూట్‌కెనాల్ చేస్తున్నామని పేర్కొన్నారు.
పైసా ఖర్చు లేకుండా..
పైసా ఖర్చు లేకుండా ఖరీదైన వైద్యం ఉచితంగా అందిస్తున్నాం. రూట్‌కెనాల్ వంటి చికిత్సలకు కార్పొరేట్ దవాఖానల్లో వేల రూపాయలు ఖర్చవుతుంది. ఒక రూట్‌కెనాల్ థెరపీకి కార్పొరేట్లో అయితే బాగా ఖరీదు. ప్రభుత్వ దంత వైద్యశాలలో ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దంత పరీక్షలు చేసి, చికిత్స చేసేందుకు మొబైల్ దంత వైద్యశాలను సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రభుత్వ దంత వైద్యశాల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో ఈ మొబైల్ వైద్యశాల ద్వారా దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారిని ఇక్కడకు రప్పించి రూట్‌కెనాల్ థెరపీ చికిత్సను అందిస్తున్నాం.
-డా.సర్జీవ్సింగ్ యాదవ్, కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ విభాగాధిపతి