తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 13 : మాతృభాషలోని సాహిత్యాన్ని ఈతరం పిల్లలకు పరిచయం చేయాలని, ఇందుకు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు తమ గురువు పోలూరి హనుమజ్జానికీరామ శర్మ స్మృత్యర్థం నెలకొల్పిన సాహితీ పురస్కారాన్ని 2022 సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త, దూరదర్శన్ పూర్వ సహాయ డైరెక్టర్ డాక్టర్ రేవూరి అనంతపద్మనాభరావుకు అందజేశారు. పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో పద్మనాభరావుకు పురస్కారం కింద 25వేల నగదు, సన్మానంతో పాటు జ్ఞాపిక అందజేశారు.
ఈ సందర్భంగా పురస్కార గ్రహీత అనంత పద్మనాభరావు రచించిన ఆచార్య దేవోభవ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భావితరాలకు స్ఫూర్తి కలగాలనే సంకల్పంతో తన గురువు పేరుతో పురస్కారాన్ని నెలకొల్పానని తెలిపారు. మాతృభాష ఆగిపోతే శ్వాస ఆగిపోయినట్లేనని పేర్కొన్నారు. శాంతాబయోటెక్నిక్స్ అధినేత డాక్టర్ కే.ఐ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ… మాతృభాష మనకు ఆయువు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, సాహితీవేత్త డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి పాల్గొన్నారు.