సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): డిమాండ్లు సాధిస్తాం.. హక్కులను కాపాడుకుంటామని భారతీయ జీవిత బీమా రంగం (ఎల్ఐసీ) ఏజెంట్లు నినదించారు. దేశవ్యాప్తంగా ‘రెస్ట్ డే’ పేరుతో కొనసాగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోని పలు బ్రాంచ్ కార్యాలయాల వద్ద తమ నిరసనను తెలియజేశారు. బ్రాంచ్ కార్యాలయాల వద్ద ప్లకార్డులు ప్రదర్శించారు.
డిమాండ్లు సాధించేంత వరకు ఉద్యమం చేస్తామని చెప్పారు. అందరి ఏజెంట్లకు గ్రూప్ మెడిక్లెయిమ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని రద్దు చేసి, పాలసీదారులకు ఇచ్చే బోనస్ పెంచాలన్నారు. ఏజెంట్లకు బెనిఫిట్స్ పెంచాలని కోరారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలోని అబిడ్స్‌లోని సిటీ బ్రాంచ్-7తో పాటు బర్కత్‌పుర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎల్ఐసీ ఏజెంట్ల నేతలు నిరసన తెలిపారు. కార్యక్రమంలో జితేంద్ర విజయ్ వర్గీ, సంధ్యాశర్మ, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.