సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు గుట్టలు, గుట్టలుగా పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు అపరిశుభ్రతకు నిలయంగా ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వాటికొక సరికొత్త అర్ధం చెబుతూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. జీడిమెట్ల, ఫతుల్లాగూడ ప్రాంతాల్లోని నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరుతో అద్భుతమైన ఫలితాలను సాధించింది.
దాదాపు ఏడాన్నర వ్యవధిలోనే భవన వ్యర్థాల నుంచి 1.85 లక్షల టన్నుల ఇసుక, కంకరను తయారు చేశారు. నాణ్యతకు డోకా లేని బంక మట్టి, దొడ్డు కంకర, సన్న కంకర, దొడ్డు ఇసుక, సన్న ఇసుక, లోహాలు, ఇతరత్రా ముడి వస్తువులుగా మార్చారు. వాటితో సిమెంట్, సిమెంట్ ఇటుకలు, టైల్స్, పేవర్ బ్లాక్స్, ప్రీకాస్ట్ కాంక్రీట్ గోడలు, సిమెంట్ దిమ్మెలు ఇతరత్రా పరికరాలను తయారు చేస్తున్నారు.
నగరం నలువైపులా నాలుగు ప్లాంట్లు
భవన నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువచ్చేందుకు నగరం నలువైపులా నాలుగు చోట్ల (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ సారథ్యంలో రాంకీ ఆధునిక వెబ్ టెక్నాలజీతో జీడిమెట్ల కేంద్రంగా 2020 నవంబర్లో, ఫతుల్లాగూడ కేంద్రంగా 2021 జూన్లో ప్లాంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కో కేంద్రంలో రోజుకు 500 టన్నుల వ్యర్థాలను శుద్ధి చేస్తున్నారు.
ఇందులో భాగంగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 20.86 లక్షల టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ సేకరించింది. అందులో సచివాలయం కూల్చివేతతో ఉత్పత్తయిన 1,60,0451 టన్నుల నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయి. ఇటీవల శంషాబాద్, తిమ్మాయిపల్లిలో ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. కాగా ఇంటి నిర్మాణం, మరమ్మతులతో వచ్చే వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడం చట్ట విరుద్ధమని, సంబంధిత వ్యక్తులు టోల్ ఫ్రీ నంబరు 1800 120 1159ను సంప్రదించి వ్యర్థాలను జీహెచ్ఎంసీకి అప్పగించాలని సూచించారు.