మన్సూరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణలోకి రాకుండా బీజేపీని నిలువరించేందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు తెలిపారు. ‘మునుగోడు ఎన్నికలు.. మన కర్తవ్యం’ పేరుతో నగరంలో స్థిరపడిన మునుగోడు నియోజకవర్గ సీపీఎం కార్యకర్తలు, సానుభూతిపరులతో బుధవారం మన్సూరాబాద్‌లోని ఎంఈరెడ్డి గార్డెన్లో రంగారెడ్డి జిల్లా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశానికి హాజరైన చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని తెలిపారు. కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నీతి, నిజాయితీల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని ఆయన విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీని ఓడించాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపై ఉందని.. మునుగోడులో బీజేపీని ఓడించి తమ బలాన్ని చాటుకుంటామని తెలిపారు. నగరంలో ఉంటున్న మునుగోడు నియోజకవర్గ సీపీఎం నాయకులు బీజేపీని ఓడించేందుకు రంగంలోకి దిగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల నరసింహారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, నల్గొండ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు పార్థసారథి, తుమ్మల సత్తిరెడ్డి, కీసరి నర్సిరెడ్డి, సంధ్య, కనకయ్య, సీహెచ్. కృష్ణయ్య, దోనూరు కృష్ణారెడ్డి, నోముల సుదర్శన్ రెడ్డి, సీహెచ్ మల్లేశం, సయ్యద్ జానీ, వెంకటేశ్, విజయ్, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.