కవాడిగూడ, అక్టోబర్ 10: హైదరాబాద్లో జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవ కార్యక్రమాలకు సర్వం సిద్ధం చేశామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కల్యాణం, శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో.. ఈ నెల 11 నుంచి 15 వరకు నిర్వహించ తలపెట్టిన వేంకటేశ్వర స్వామికి నిత్యోత్సవం వారోత్సవాల కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. గోపూజను నిర్వహించారు. అనంతరం స్వామి వారి ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించి, వైభవోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..ఈ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి భక్తుడికి తిరుపతిలో అందించే ప్రసాదం మాదిరిగానే ఇక్కడ కూడా దేవుడి ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. దాదాపు పది వేల మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో హర్ష ఆటో గ్రూపు ఎండీ హర్షవర్ధన్, అపర్ణ గ్రూపు ఎండీలు ఎస్.ఎస్.రెడ్డి, సి.వెంకటేశ్వర్ రెడ్డి, వంశీరామ్ బిల్డర్స్ ఎండీ బి. సుబ్బారెడ్డి పాల్గొన్నారు.