మేడ్చల్ కలెక్టరేట్, ఆక్టోబర్ 10 : మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 9వ వార్డు భవానీనగర్ కాలనీలో మంత్రి సోమవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రజాసమస్యలను తెలుసుకున్నారు. నాలాను సందర్శించి శుభ్రం చేయాలని, అభివృద్ధి పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ దమ్మాయిగూడ చెరువు నుంచి నాసిక్ చెరువు వరకు సివరేజీ పైపులైన్ పనులకు ప్రభుత్వం రూ.7కోట్ల10 లక్షలు కేటాయించిందని, ఆ నిధులతో 13, 14, 15, 8వ వార్డుల్లో చేపట్టిన పైపులైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపారు. 9వ వార్డులో పైపులైన్ పనులకు మరిన్ని నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని, ఆ నిధులతో పనులను పూర్తి చేస్తామన్నారు. భవానీనగర్ కాలనీలో రోడ్లు, మురుగు కాలువల పనులకు నిధులు అందజేస్తామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల్లో ఇంటింటికీ ఉచితంగా తాగునీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి, హెచ్ఎండీఎ ఏఈ వెంకన్న, ఇరిగేషన్ డీఈ సురేశ్, వార్డు ఇన్చార్జి రాములు, కౌన్సిలర్లు సరిత, రమేశ్ గౌడ్, నర్సింహా రెడ్డి, శ్రీహరిగౌడ్, నాయకులు యాదగిరి గౌడ్, తిరుపతి రెడ్డి, కిరణ్, నరహరి రెడ్డి, సాయినాథ్ గౌడ్, కార్తిక్ గౌడ్, ఖాజామియా, శ్రీకాంత్ గౌడ్, వినోద్ రెడ్డి, లక్ష్మీప్రసన్న, కాలనీ వాసులు పాల్గొన్నారు.