చౌటుప్పల్ రూరల్,అక్టోబర్ 8 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా బీజేపీ కుట్ర పన్ని మునుగోడు ఉప ఎన్నికకు తెర లేపిందని, ఆయన ఢిల్లీలో అడుగుపెడితే క్రియాశీలకంగా మారుతాడనే భయం మోదీ, అమిత్‌షాకు పట్టుకుందని, అందులో భాగంగానే రాజగోపాల్‌రెడ్డికి రూ.22వేల బొగ్గుగనుల కాంట్రాక్ట్ ఇచ్చి రాజీనామా చేయించి ఈ ఎన్నిక తెచ్చారని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం మండలంలోని డి.నాగారం, దామెర, చింతలగూడెం తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. వీటిని చూసి బీజేపీ పాలిత 18 రాష్ర్టాల సీఎంలు మోదీపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ పెద్ద స్కామ్‌ల ప్రభుత్వమని విమర్శించారు. మోదీ తన దోస్తుల కోసమే రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారన్నారు. అందులో అదానీకి ఇచ్చినవే రూ.24వేల కోట్లు ఉన్నాయని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి చేతగాని తనం, వ్యక్తిగత స్వార్థం కోసమే ఈ ఎన్నిక అని స్పష్టం చేశారు. 4 ఏండ్లు ఎమ్మెల్యే పదవి అనుభవించి మరో ఏడాది ఉండగా రాజీనామా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మునుగోడు ప్రజలను మోసం చేసిన రాజగోపాల్‌రెడ్డికి డిపాజిట్ కూడా రాకంపడా చిత్తుచిత్తుగా ఓడిపోతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సర్పంచులు కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, నారెడ్డి ఆండాలు, మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌గౌడ్, డీసీసీబీ మాజీ డైర్టెక్టర్ పిల్లలమర్రి శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నారెడ్డి అభినందన్‌రెడ్డి ఉన్నారు.
మునుగోడులో గులాబీ పార్టీకి ఎదురు లేదు;బీజేపీ జేబు సంస్థలుగా ఈడీ, సీబీ: మంత్రి సత్యవతి రాథోడ్
సంస్థాన్ నారాయణపురం. అక్టోబర్ 8 : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు ఎదురు లేదని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలుగా పని చేస్తున్నాయని విమర్శించారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పొర్లగడ్డతండాలో శనివారం ఆమె గిరిజనులతో కలిసి గడపగడపకూ తిరిగి ప్రచారం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ఓ స్వార్థపరుడి రాజీనామాతో రావడం దురదృష్టకరమన్నారు. అలాంటి వ్యక్తి గురించి మంత్రి స్థాయిలో ఉండి తాను మాట్లాడలేనన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రత్యర్థి కాంగ్రెస్ అని, బీజేపీది మూడో స్థానమేనని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని, ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, వైస్ ఎంపీపీ రాజు, నాయకులు బిచ్చునాయక్, రాజేశ్‌నాయక్, శ్రీను, జగదీశ్‌నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజగోపాల్‌రెడ్డికి రాజకీయ సన్యాసం తప్పదు; సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను గెలిపిస్తాయి: మంత్రి గంగుల కమలాకర్
కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాజకీయ సన్యాసం తప్పదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తన స్వార్థం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మునుగోడుకు ఉప ఎన్నికలు తెచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. యుద్ధంలో గెలిపించి నాయకుడిని చేసి ముందుకు నడిపిస్తే వెన్నుచూపి వెనుతిరిగి మునుగోడు ప్రజలను మోసం చేసిన ద్రోహి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తుంగతుర్తి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి, నాయకులు జంగారెడ్డి, శివశంకర్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మునుగోడు కానుకగా ఇస్తాం
ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే సీటును కానుకగా ఇస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం ఎన్నికల్లో చౌటుప్పల్ మున్సిపాలిటీ 17,18 వార్డులకు టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎన్నికల ఇన్చార్జిగా ఉన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు టీఆర్ఎస్ పార్టీపై నమ్మకంతో ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఐదుగురు సభ్యులతో ఒక టీంగా ఒక్కో వార్డులో 50 మందితో కమిటీలను వేసి పకడ్బందీగా ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు నర్సిరెడ్డి, దామోదర్‌రెడ్డి, మల్లేశం, కిరణ్, శశిధర్‌రెడ్డి, అమర్, రాంరెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, నాయకులు ఓరుగంటి వెంకటేశ్, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాహుల్‌గౌడ్, హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, హస్తినాపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సత్యం చారి తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్లో మునుగోడు కాల్‌సెంటర్
నగరంలోని మునుగోడు ఓటర్ల కోసం ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపే ధ్యేయంగా 30 మందితో ప్రచారం చేయనున్నారు. మునుగోడు ఓటర్లు ఎల్బీనగర్, పరిసర ప్రాంతాల్లో ఉండడంతో వారి వివరాలను టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు సేకరిస్తున్నారు. వీరిని కాల్‌సెంటర్ ద్వారా సంప్రదించి, టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయమని కోరనున్నారు.