మాదాపూర్, అక్టోబర్ 8: మాదాపూర్‌లోని హెచ్ఐసిసిలో శనివారం హై బిజ్ టీవీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ కేర్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విచ్చేసి లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్‌తో పాటు హై బిజ్ టీవీ మేనేజ్మెంట్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యులు దేవుడితో సమానమని, తల్లి జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారని ఆయన అన్నారు. కరోనా సమయంలో పలు దవాఖానలు, వైద్యులు చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ సేవలను అందించిన పలువురు వైద్యులకు మంత్రి చేతుల మీదుగా పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా కార్డియాలజీ, సీటీ సర్జరీ, న్యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యూరాలజీ, పీడియాట్రిక్స్ సర్జరీ, పీడియాట్రిక్స్, అనెస్థెటిక్స్ ఎటిరీల్లో అవార్డులను అందజేయగా నెఫ్రాలజీ, ఇఎన్‌టి, ఆప్తాల్మాలజీ, గైనకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, డెర్మటాలజీ, డయాబెటాలజీ, జనరల్ ఫిజీషియన్, ఎండోక్రైనాలజిస్ట్, వ్యాస్కులర్ సర్జరీ, అంకాలజీ, హెమటాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, రుమటాలజీ, జనరల్ సర్జరీ, ఫెర్టిలిటీ స్పెషాలిటీ, పల్మనాలజిస్ట్, అంబులెన్స్, సర్వీసెస్, ఆయుర్వేదం, బేరియాట్రిక్ సర్జరీ, మైక్రో బయాలజీతో పాటు డాక్టర్, ఆర్టిస్ట్, డాక్టర్ పొలిటీషియన్ తదితర విభాగాల్లో పురస్కారాలను అందజేశారు. అనంతరం మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రారెడ్డి, మల్లారెడ్డి హెల్త్ కేర్ ఎండీ ప్రీతిరెడ్డి, హై బిజ్ టీవీ (తెలుగు నౌ) వ్యవస్థాపకుడు, ఎండీ రాజగోపాల్ మాడిశెట్టి, హై బిజ్ చానెల్ సీఈఓ జె. సంధ్యారాణిలకు లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందజేశారు.