ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 8: దేశంలో మహిళలకు సమాన అవకాశాలు లభించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) మాజీ డైరెక్టర్, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా (ఎన్ఏఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ మోహన్రావు పిలుపునిచ్చారు. మహిళలకు ప్రోత్సాహం అందించేందుకు ఆయా రంగాల్లో విజేతలుగా నిలిచిన మహిళలను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ నెల 10న ‘వుమెన్ సైంటిస్ట్స్ కాన్క్లేవ్ – సెల్ఫ్ రిలయెన్స్’ను నిర్వహించనున్నట్లు చెప్పారు. సీసీఎంబీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోహన్రావు మాట్లాడుతూ… ఎన్ఏఎస్ఐ, అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ) సంయుక్తంగా ఐఐసీటీలోని వివేకానంద ఆడిటోరియంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 10న సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరిగే ఈ సమ్మేళనం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, గౌరవ అతిథులుగా డీఆర్డీవో ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెస్సీ థామస్, ప్రముఖ రచయిత్రి రాజ్కుమారి ఇందిరాదేవి ధన్రాజ్గిర్ హాజరవుతారని చెప్పారు. వీరితో పాటు పలువురు ప్రముఖులు హాజరై ప్రసంగిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్టీసీ కన్వీనర్ సీఎల్ నరసింహారావు, డాక్టర్ శాస్త్రి పాల్గొన్నారు.