సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి-సంక్షేమాన్ని ప్రతి ఇంటికీ తీసుకువెళ్లేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయికి చేరుకున్నారు.
గ్రేటర్ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు ఈ నాలుగు జిల్లాల పరిధిలోని ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ పలు యూనిట్ల బాధ్యతలను అప్పగించారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు నగారా మోగిన దరిమిలా గులాబీదళం క్షేత్రస్థాయి ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గంలోని ప్రతి ఓటరుకు వివరించేలా టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరోసిస్ భూతంతో ఇరవైలోనే అరవై ఏండ్ల ఛాయలతో కునారిల్లిన జనానికి మిషన్ భగీరథ నీరు సంజీవనిలా మారిన వైనం యావత్తు ప్రపంచం చూసింది.
ఇంకోవైపు రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందుకున్న వాస్తవాలు కూడా నియోజకవర్గ ప్రజల మదిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఉప ఎన్నిక దరిమిలా ఇంటింటికీ ఈ అంశాలను మరోసారి తీసుకువెళ్లి ఓటర్లను చైతన్యం చేసేందుకు పార్టీ అధిష్ఠానం ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది.
ఇందులో ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులకు కూడా ఒక్కొక్కరికి ఒక ఎంపీటీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) పరిధిగానీ రెండు వార్డులను గానీ ఒక యూనిట్‌గా పరిగణించి ప్రచార బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల మూడో తేదీన పోలింగ్ జరుగనున్నందున ప్రచారం ముగిసే వరకు వీరంతా క్షేత్రస్థాయిలోనే ఉండి తమ పరిధుల్లో ఓటర్లను కలవడంతో పాటు స్థానిక టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు, కార్యకర్తల్ని సమన్వయం చేసుకోనున్నారు.
చౌటుప్పల్‌లో మంత్రి మల్లారెడ్డి ప్రచారం
మేడ్చల్, అక్టోబర్7(నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని కాట్రేవు, ఆరెగూడెం, గుండ్లబావి గ్రామపంచాయతీల పరిధిలో శుక్రవారం రాష్ట్రకార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. రైతులు, మహిళలు, యువకులతో సమావేశం నిర్వహించి కారుగుర్తుకు ఓటేసి బీఆర్ఎస్(టీఆర్ఎస్)పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రచార కార్యక్రమంలో మల్లారెడ్డి వెంట మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, నాయకులు దర్గా దయాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి, తదితరులు ఉన్నారు.