సిటీబ్యూరో, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో మెరుగైన సైక్లింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నగరంలో 90 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసే దిశగా జీహెచ్ఎంసీ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని జోన్ల పరిధిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సైకిల్ ట్రాక్ పట్ల ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో నగర వ్యాప్తంగా ఎంపిక చేసిన జోన్లలో శాశ్వతంగా, తాత్కాలికంగా ట్రాక్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
తాజాగా..ఏర్పాటు చేస్తున్న సైక్లింగ్ ట్రాక్‌లు సైతం నగర వాసుల శారీరక ఒత్తిడిని తగ్గించడంతోపాటు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే దిశగా దోహదపడనున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటుచేసే ప్రాంతాల్లో సైక్లింగ్ ట్రాక్‌ను ఉదయం 8 గంటల వరకు అందుబాటులో ఉంచి, ఆ తర్వాత వాటిని తొలగించి వాహనాల రాకపోకలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య ఉండదని అధికారులు చెబుతున్నారు.
సైక్లింగ్ ట్రాక్ ప్రతిపాదిత ప్రాంతాలివే..
త్వరలోనే అందుబాటులోకి తెస్తాం
జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతులకు పెద్దపీట వేసి ప్రజలకు అన్నిరకాల సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే నగర వ్యాప్తంగా అనువైన చోట్ల 90 కిలోమీటర్ల మేర తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించినం. గతంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ట్రాక్‌ల వల్ల సత్ఫలితాలు రావడంతో నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ట్రాక్‌లను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం.
– గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ మేయర్
ఆరోగ్య మెరుగుకు దోహదం
సైక్లింగ్ వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు శారీరక దృఢత్వం సైతం మెరుగుపడుతుంది. ఇప్పటికే నగరంలో రోడ్లను అభివృద్ధి చేశాం. అలాగే సైక్లింగ్ ట్రాక్‌లను కూడా ఏర్పాటు చేయనున్నాం. ఈ ట్రాక్‌లు నగరవాసుల ఆరోగ్యం మెరుగుకు దోహదపడనున్నాయి.
– శ్రీలత శోభన్ రెడ్డి,జీహెచ్ఎంసీ డిఫ్యూటీ మేయర్