ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 7: ఇబ్రహీంపట్నం పెద్దచెరువు దాదాపు 45 ఏండ్ల తర్వాత అలుగు పారుతున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువులు, కుంటలు పూర్తిగా నిండిపోవడంతో ఇబ్రహీంపట్నం పెద్దవాగుతోపాటు రాచకాల్వ నుంచి పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం పెద్దచెరువుకు వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటిసామర్థ్యం సుమారు 39 అడుగులకు చేరింది. ఈ చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో చిన్నచెరువు కూడా నిండిపోయి అలుగు పోస్తున్నది. ఇబ్రహీంపట్నం పెద్ద, చిన్నచెరువులను చూసేందుకు స్థానికులతో పాటు నగరానికి చెందిన వారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా పెద్ద చెరువు అలుగు పారుతుండటంతో మత్స్యకారులు చేపలు బయటకు వెళ్లకుండా జాలీలను ఏర్పాటుచేశారు.
స్తంభించనున్న రాకపోకలు..
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు అలుగు పారుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చెరువు అలుగు పోస్తుండటంతో నగరంతోపాటు ఇబ్రహీంపట్నం నుంచి ఉప్పరిగూడ, పోచారం గ్రామాలకు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఈ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నుంచి ఇబ్రహీంపట్నం పెద్దచెరువు వాగు పొంగిపొర్లుతున్నది. ఇప్పటికే రెండు గ్రామాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. శేరిగూడ సమీపంలో సాగర్ రహదారిపై వర్షం నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో సాగర్ రహదారిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసి బైపాస్ రోడ్డు నుంచి మళ్లించే అవకాశాలున్నాయి.
రెండు పునరావాస కేంద్రాల ఏర్పాటు
ఇబ్రహీంపట్నం చిన్నచెరువులో నీట మునిగి న ఇండ్ల బాధితులకోసం రెండు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఉర్దూ మీడియం పాఠశాలతో పాటు స్థానిక సాయి ఫంక్షన్ హాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి, వసతులను కల్పించడంతోపాటు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నాం. బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లాలి.
-యూసఫ్, మున్సిపల్ కమిషనర్