రవీంద్రభారతి,అక్టోబర్ 7: గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం తనకే కాదు ప్రపంచంలోని తెలుగు వారందరికీ అభిమాన గాయకుడు అని, తరతరాలుగా ఆయన గుర్తుండి పోయేలా వేలాది పాటలు పాడి అభిమానం సొంతం చేసుకున్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, శ్రీడెవలపర్స్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్పీ శైలజ, నేమాని పార్థసారథిలతో నిర్వహించిన బాలు సినీ సంగీత విభావరి కనుల విందు చేసింది. ఈ సందర్భంగా పాడుతా తీయగా ఫేమ్ నేమాని పార్థసారథిని కిన్నెర బాలు పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
ముఖ్య అతిథిగా హాజరైన సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ… ఎస్పీ బాలు పాటలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయని కొనియాడారు. గాయకులందరికి స్ఫూర్తి స్వరం బాలసుబ్రహ్మణ్యం అని అభివర్ణించారు. సభాధ్యక్షత వహించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి .రమణాచారి మాట్లాడుతూ… బాలు స్వరం అమృతం అని, దేవస్థానం సినిమాలో బాలుతో కలిసి నటించే అదృష్టం తనకు కలిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సభలో రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఎల్.వి సుబ్రహ్మణ్యం, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్, గాయని ఎస్పీ శైలజ, డాక్టర్ జి.సూర్యప్రకాశ్, శ్రీడెవలపర్స్ ఎండీ భోగరాజుమూర్తి పాల్గొన్నారు. కార్యక్రమంలో మద్దాలి రఘురామ్, వ్యాఖ్యాత ఎం. కె. గాంధీ తదితరులు పాల్గొన్నారు.