రవీంద్రభారతి,అక్టోబర్ 7 : డా.సుద్దాల అశోక్ తేజ గొప్ప సినీగేయ రచయిత అని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.కె.వి వరప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యువకళావాహిని ఆధ్వర్యంలో శుక్రవారం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డా. సుద్దాల అశోక్ తేజకు సినారే సాహితీ పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డా.కె.వి వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిన గొప్ప సినీగేయ రచయిత డా.సి.నారాయణరెడ్డి అని కొనియాడారు. సుద్దాల అశోక్‌తేజకు సినారే సాహితీ పురస్కారం రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి డా.జె.చెన్నయ్య, సారిపల్లి కొండల్రావు, యువకళావాహిని వ్యవస్థాపక అధ్యక్షుడు లంకా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు గాయకులు సినారే సినీసుస్వరాలను ఆలపించి సభికులను ఆనంద పరిచారు.