కీసర, అక్టోబర్ 7: ప్రతినిత్యం రద్దీగా ఉండే కరీంగూడ-భోగారం రోడ్డు అస్తవ్యస్తంగా మారడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణీకులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు మొత్తం అడుగడుగునా గుంతలు పడటంతో ఈ మార్గం వెంట వెళ్లాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి రాంపల్లి దయార రెవెన్యూ పరిధికి సంబంధించి మెయిన్‌రోడ్డును ఆనుకొని ప్రైవేట్ సంస్థలకు సంబంధించి పలు రకాల గోదాంలను మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా నిర్మించారు. ఈ గోదాంలకు ప్రతినిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు వెళుతుంటాయి. దీంతోపాటు ఇటీవల కురిసిన వర్షాలకు ఈ రోడ్డు పూర్తిగా చెడిపోయి అడుగడుగునా గుంతలు పడి ప్రయాణీకులకు నరక ప్రాయంగా మారిపోయింది.
ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలంటే తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని పలువురు ఆరోపిస్తున్నారు. భోగారం నుంచి ఈ రోడ్డు మార్గం గుండా చర్లపల్లి ఇండస్ట్రీకి చాలా మంది కార్మికులు ద్విచక్ర వాహనాల మీద వెళ్తుంటారు. ప్రధానంగా ఈ గోదాంలను ఆనుకొని ఓ ప్రైవేట్ స్కూల్ కూడా ఉంది. అటు వాహనదారులకు, విద్యార్థులకు ఈ మార్గం గుండా వెళ్లాలంటే పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు బాగుచేయాలంటూ పంచాయతీ కార్యదర్శికి సైతం స్థానికులు వినపత్రాన్ని కూడా అందజేశారు.
నిధులు మంజూరు అయ్యాయి…
కరీంగూడ-భోగారం రోడ్డు మరమ్మతుల కోసం ప్రభుత్వానికి గతంలోనే నివేదిక పంపించాం. ప్రభుత్వం నుంచి ఈ రోడ్డు మరమ్మతుల కోసం రూ.3.2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, వర్షాలు తగ్గగానే రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆర్అండ్బీ డీఈ రవీందర్‌గౌడ్ స్పష్టం చేశారు.