పొట్ట చేత పట్టుకొని నగరానికి వచ్చిన వారందరినీ అన్నపూర్ణలా అక్కున చేర్చుకొని ఆకలి తీర్చే నగరం హైదరాబాద్. గత ఎనిమిదేండ్లుగా మౌలిక సదుపాయాల విషయంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న మన నగరం అన్ని జాతులకు, రాష్ట్రాల వారికీ అత్యంత నివాస యోగ్యంగా మారిన విషయం తెలిసిందే. పారిశ్రామిక పురోగతిలో, ఐటీ సేవల విస్తరణలో దేశానికే రోల్‌మోడల్‌గా ఎదుగుతున్న సిటీలో అత్యంత తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా సులభంగా బతుకు వెళ్లదీయొచ్చని తేలింది. ఇంటి అద్దెలు, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు, కూరగాయల ధరల వంటి విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఖర్చుల విషయంలో భారీ వ్యత్యాసం ఉందని వెల్లడైంది. నెలకు 10వేల రూపాయలు సంపాదించే చిరుద్యోగికి హైదరాబాద్‌లో నెల రోజులకు సరిపోయేలా ఖర్చులు ఉంటే.. ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో ఆ పదివేలు కేవలం 18-22 రోజుల్లోనే ఖర్చవుతున్నాయని స్పష్టమైంది. కరోనా తదనంతరం ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అవసరమయ్యే ఖర్చులపై మెర్సర్ మొబిలిటీ ఇండియా అనే సంస్థ అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధిక మౌలిక సదుపాయాలు ఉన్న హైదరాబాద్ నగరంలో తక్కువ ఆదాయంతో కూడా బతికేయొచ్చని వెల్లడించింది.
– సిటీ బ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ)
విశ్వ నగరి హైదరాబాద్‌లో దేశంలోని ఇతర నగరాలతో పోల్చితే లగ్జరీ మ్యాన్ నుంచి పేదోడి వరకు బతికేందుకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన మెట్రో నగరాలతో పోల్చితే తక్కువ ఖర్చులతో బతుకు బండిని లాగే సౌలతులు హైదరాబాద్ నగరం కలిగి ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై, సిలికాన్ సిటీ బెంగళూరులో సామాన్యుడికి ఆవాస యోగ్యతకు అనుకూలమైన పరిస్థితులే లేవని మెర్సర్ మొబిలిటీ ఇండియా అధ్యయనంలో వెల్లడైంది. రెండేండ్ల్ల కరోనా తర్వాత మారిన ఆర్థిక, సామాజిక స్థితిగతులపై పరిశోధన చేయగా.. హైదరాబాద్‌లో తక్కువ ఖర్చుతో జీవించేందుకు అనుకూలంగా ఉందని సర్వేలో తేలింది.
ఒకప్పటి చరిత్రాత్మక నగరం నుంచి ప్రస్తుతం గ్లోబల్ సిటీ వైపు వడివడిగా అడుగులు వేస్తున్న మోడ్రన్ హైదరాబాద్ వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంది. పేరుకు ఐటీ కేంద్రమే అయినా.. ఇతర నగరాలతో పోల్చితే ఇంటి అద్దెలు, కూరగాయలు, నిత్యావసర, రవాణా ఖర్చుల వంటి ప్రదానమైన అంశాల్లో తక్కువగా ఉందని గుర్తించింది. ధనికులతోపాటు బస్తీలు, సాధారణ కాలనీల్లో నివాసం ఉండే మిడిల్, అప్పర్ మిడిల్ క్లాస్ జనాల వరకు అందరికి అనువైన ప్రదేశంగా నిలిచింది.
అద్దెలు, హోటళ్లు, నిత్యావసర సరుకులు, రవాణా చార్జీలలోనూ హైదరాబాద్ ధరలు 20-30శాతం వరకు తక్కువే. ఆ మూడు నగరాల్లో జీవనం సాగించే మధ్య తరగతి కుటుంబం ఇంటి ఖర్చులు ఏకంగా 20-30 తక్కువతో పొదుపు జీవితాన్ని గడిపేయవచ్చని తేలింది.
ఏడు మెట్రో నగరాల్లో పోల్చితే హైదరాబాద్‌లో ఇంటి కిరాయిల్లో భారీ వ్యత్యాసమే ఉంది. మిగతా నగరాల్లో అన్ని ప్రాంతాల్లో దాదాపు సమానమైన ఇంటి అద్దెలు ఉంటే హైదరాబాద్‌లో ప్రాంతాన్ని బట్టి ఇంటి అద్దెలు ఉన్నాయి. కోర్ సిటీ, శివారు ప్రాంతాలు, కమర్షియల్ ఏరియాల వారీగా కనీస అద్దెలు రూ. 4వేల నుంచి రూ. 25వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ బిల్డింగ్‌లో సింగిల్ బెడ్రూం ఇంటి అద్దె రూ.6 వేలు ఉంటే… బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో కనీస ధర రూ. 10-12 వేలు ఖర్చు చేసిన దొరికే పరిస్థితి లేదని తేలింది.
కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులపై మెర్సర్ మొబిలిటీ ఇండియా అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో అవసరమయ్యే ఖర్చులపై లెక్కలు వేసింది. ప్రధానంగా రవాణా, నివాసం, నిత్యావసర ధరలను ఆధారంగా చేసుకుని ధనిక, మధ్య, పేద తరగతుల వారీగా అవుతున్న ఖర్చులను అధ్యయనం చేసింది. ఇండియాలోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా నగరాలతో పోల్చితే.. హైదరాబాద్ సామాన్యుడికి అనువైన ప్రాంతంగా తేలింది.
ఉదాహరణకు 10వేలు సంపాదించే చిరుద్యోగి హైదరాబాద్‌లో నెల రోజులకు సరిపోయేలా ఖర్చులు ఉంటే… అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో 18-22 రోజుల్లోనే సంపాదించుకున్న 10వేలు ఖర్చు అవుతాయని వెల్లడైంది.
హైదరాబాద్ సిటీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు తక్కువగా ఉండటంతోనే హైదరాబాద్‌లో బతికేందుకు వలసలు వస్తుంటారు. అదేవిధంగా మెరుగైన రోడ్లు, రవాణా, వైద్య, వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు సిటీ వ్యాప్తంగా విస్తరించడంతోపాటు తాగునీరు, విద్యుత్ చార్జీల వ్యయం తక్కువగా ఉండటంతోనే సామాన్యుడికి సస్తా సిటీగా గుర్తింపు పొందినట్లుగా అధ్యయనంలో స్పష్టమైంది.