screen protectors : ఏ కొత్త మొబైల్ ఫోన్ కొన్నా స్క్రీన్ గార్డ్ లేదా స్క్రీన్ ప్రొటెక్షన్ వేయించుకోవడం కామన్. ఈ స్క్రీన్ గార్డ్స్ రోడ్డు పక్కన ఎక్కడంటే అక్కడ, తక్కువ ధరలో దొరుకుతాయి. వాటిలో చాలా వరకు క్వాలిటీ తక్కువ. దీంతో అనేకసార్లు వినియోగదారులు మోసపోతుంటారు. అయితే, ఇకపై లో క్వాలిటీ, చీప్ స్క్రీన్ ప్రొటెక్టర్లు, స్క్రీన్ గార్డ్స్ మార్కెట్లో ఉండవు. ఎందుకంటే, ఇలాంటి తక్కువ నాణ్యత కలిగిన స్క్రీన్ ప్రొటెక్టర్లు, స్క్రీన్ గార్డులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ఈ నిర్ణయం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు కానుంది. తగిన ప్రమాణాలు పాటించని వాటిపై ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ మేరకు స్క్రీన్ ప్రొటెక్టర్లను కూడా కేంద్రం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్స్ (బీఐఎస్) కిందకు తీసుకొచ్చింది. అంటే.. దీని పరిధిలో ఉన్న ఉత్పత్తులు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కనీస నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించాలి. దీనిపై తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 21, సోమవారం ఈ ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లు తయారు చేసే సంస్థలు తప్పనిసరిగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బీఐఎస్ రూపొందించిన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి.
ఏప్రిల్ 1 నుంచి విక్రయించబోయే స్క్రీన్ గార్డులు ఈ నాణ్యతను కలిగి ఉండాలి. ఇప్పటికిప్పుడు వీటిపై నిషేధం ఉండదు. కంపెనీలు తమ తయారీని మార్చుకునేందుకు, కొత్తవి, నాణ్యమైనవి తయారు చేసేందుకు, ఉన్న వాటిని విక్రయించేందుకు ఇంకా ఆరు నెలల గడువు ఉంది. కేంద్రం రూపొందించిన రూల్స్ ప్రకారం.. ప్రతి గ్లాస్ తగిన నాణ్యత కలిగి ఉండాలి. అలాగే, స్క్రీన్ విజిబుల్‌గా ఉండాలి. ప్యాకేజింగ్‌కు సంబంధించిన వివరాలు ఉండాలి. బ్లూ లైట్ ఫిల్టరింగ్, యాంటీ గ్లేర్, ప్రైవసీ వంటి ఫీచర్లు కలిగి ఉండాలి. ఈ నిర్ణయం అమలైతే వినియోగదారులకు క్వాలిటీ కలిగిన మొబైల్ స్క్రీన్ గార్డులు మాత్రమే మార్కెట్లో లభిస్తాయి.