PM Modi : ‘ఆసియా క్రీడలు-2026 (Asian Games-2026)’ లో భారత్ స్వర్ణ పతకాల (Gold Medals) ఖాతాను ఘనంగా ప్రారంభించింది. మహిళా క్రికెట్ జట్టు (Women Cricket team) అద్భుత ప్రదర్శన కనబరిచి ఈ ఎడిషన్‌లో దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించింది. ఫైనల్ పోరులో శ్రీలంక (Srilanka) ను 147 పరుగుల భారీ తేడాతో ఓడించి వరుసగా రెండోసారి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యంలోని టీమ్ఇండియా టోర్నీ ఆద్యంతం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
ఈ చారిత్రక విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. భారత క్రికెట్‌కు ఇదొక అద్భుతమైన విజయమని అన్నారు. మన క్రీడాకారిణులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం అభినందనీయమని కొనియాడారు. వారి ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, సమష్టి కృషి అమోఘమని, ఈ విజయంతో దేశం గర్విస్తోందని అన్నారు. స్వర్ణం గెలిచిన జట్టు యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిందని మోదీ ప్రశంసించారు.
మరోవైపు ఆసియా క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎంఎంఏ విభాగంలో పతకం సాధించిన సుచికా తరియల్ను కూడా ప్రధానమంత్రి అభినందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం భారత జట్టును అభినందించారు. ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందని, రాబోయే తరాలకు, ముఖ్యంగా దేశంలోని యువతకు ఇది గొప్ప స్ఫూర్తిదాయకమని కొనియాడారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ.. షఫాలీ వర్మ, స్మృతి మంధానల అద్భుత భాగస్వామ్యాన్ని, బౌలర్ల ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు.