సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) :బజాజ్ షోరూంలో చోరీ ఘటన ఖాకీ సినిమాను(2017లో కార్తి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది) గుర్తుకు తెస్తున్నది. 15 ఏండ్ల కిందట మహారాష్ట్రలో ఓ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న జార్ఖండ్ ముఠా సభ్యుడి వేలిముద్రలు, కుషాయిగూడ బజాజ్ షోరూంలో చోరీకి పాల్పడిన నిందితుడి వేలిముద్రలు సరిపోలడంతో నాడు, నేడు చోరీకి పాల్పడింది ఒక్కరేనని తేల్చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బృందాలు జార్ఖండ్ వెళ్లి నిందితుడిని అరెస్టు చేసి నగరానికి తీసుకు వచ్చారు. విచారణ నేపట్టి వివరాలు రాబట్టగా.. దొంగిలించిన సెల్ఫోన్లను నేపాల్‌కు పంపించినట్లు నిందితులు వెల్లడించారు. అయితే ఈ చోరీకి పాల్పడింది జార్ఖండ్‌కు చెందిన ఆలం గ్యాంగ్ పనేనని రాచకొండ పోలీసులు తేల్చారు. గ్యాంగ్‌కు సంబంధించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ గురువారం నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గత నెల 20వ తేదీ అర్ధరాత్రి కుషాయిగూడలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూం పైకప్పు తొలగించిన దొంగలు, అందులో ఉన్న రూ.70 లక్షల విలువైన 432 సెల్ఫోన్లను దొంగిలించుకుపోయారు. మరుసటి రోజు ఉదయం ఆ సంస్థ జనరల్ మేనేజర్ మహ్మద్ హబీబ్ కుషాయిగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుషాయిగూడ పోలీసులతో పాటు రాచకొండ ఎస్ఓటీ, సీసీఎస్, ఐటీ, క్లూస్ టీమ్ విభాగాలు ఈ ఘటనపై దృష్టి పెట్టి ఆధారాలను విశ్లేషించాయి. ఈ కేసును ఛేదించేందుకు 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల్లోని 500 సీసీ కెమెరాలు, ఘటన స్థలంలో దొరికిన వేలిముద్రల ఆధారాలను విశ్లేషించారు.
మహారాష్ట్రంలో 15 సంవత్సరాల కిందట జరిగిన ఓ దొంగతనం కేసుకు, ఈ కేసులో దొరికిన వేలిముద్ర మ్యాచ్ అయ్యింది. దీంతో ఒక బృందం ముంబాయిలోని అంతోప్హిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నిందితుడి వివరాలను ఆరా తీయగా నిందితుడు సత్తార్ షేక్ అని తెలింది. అతడిపై మరో కేసు కూడా ఉండటంతో వీటిన్నింటిని పుణే పోలీసులతో కలిసి విశ్లేషించారు. ఈక్రమంలో ఈ గ్యాంగ్ జార్ఖండ్ రాష్ట్రంలోని సాహెబ్‌గంజ్ జిల్లాకు చెందిందని, ఈ గ్యాంగ్‌కు అలాం నేతృత్వం వహిస్తుండగా.. అలాం తమ్ముడే సత్తార్ షేక్ అని తేలింది. దీంతో పోలీసులు జార్ఖండ్ వెళ్లి గత నెల 30వ తేదీన సత్తార్ షేక్‌ను అరెస్ట్ చేసి, నగరానికి తీసుకువచ్చారు. సత్తార్ ఇచ్చిన సమాచారంతో మరో నేరస్తుడు వెస్ట్‌బెంగాల్‌లో ఉన్నట్లు తెలుసుకొని, మరో పోలీస్ బృందం వెస్ట్‌బెంగాల్ వెళ్లింది. మల్దా జిల్లా పోలీసుల సహకారంతో ఈ నెల 2వ తేదీన ఎండీ అసిదుల్ షేక్ అలియాస్ బచ్చాను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. ఈ నిందితులిద్దరి వద్ద నుంచి ఓ సెల్‌ఫోన్, రూ.80 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కుషాయిగూడలో జరిగిన చోరీ ఘటనలో ప్రధాన నిందితుడైన సత్తార్ షేక్ అలాం గ్యాంగ్ లీడర్ సోదరుడు. ఈ గ్యాంగ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా బ్రాంచ్‌లో 2022 మే నెలలో చోరీకి పాల్పడింది. రూ.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను బ్యాంకు నుంచి దొంగిలించారు. ఈ గ్యాంగ్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌లోని సైదాపూర్ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ బ్యాంక్ దొంగతనం కేసు దర్యాప్తులో భాగంగా జూలై నెలలో నిందితుడిని పట్టుకోవడం కోసం యూపీ పోలీసులు షాహెబ్గంజ్ జిల్లాలోని రాధానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో తలదాచుకున్న నిందితుల స్థావరం వద్దకు వెళ్లారు. ఇది గమనించిన అలాం గ్యాంగ్ పోలీసులపై కాల్పులు జరిపింది. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అలాంకు రెండు బుల్లెట్లు తగలడంతో పోలీసులకు చిక్కాడు. సత్తార్ షేక్‌తో పాటు మిగతా ముఠా సభ్యులు అక్కడి నుంచి తప్పించుకొని పరారయ్యారు.
యూపీలో తప్పించుకున్న ముఠా సభ్యులు హైదరాబాద్‌కు వచ్చి శివారు ప్రాంతాలైన కీసర, జవహర్‌నగర్ ప్రాంతాల్లో కొన్ని రోజులు ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి పక్కా ప్లాన్‌తో కుషాయిగూడ బజాజ్ షోరూంలో చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన సెల్ఫోన్లను నేపాల్‌కు పంపించినట్లు నిందితులు వెల్లడించారు.
ఇదిలాఉండగా అలాం ప్రస్తుతం యూపీ జైలులో ఉండటంతో ఈ గ్యాంగ్‌కు సత్తార్షేక్ నాయకత్వం వహించగా, ముఠాలో సయ్యద్, అష్రుల్, బాదురుద్దీన్, ఎండీ అసిదుల్ షేక్, బెయుల్హా కుషాయిగూడ బజాజ్షోరూంలో చోరీకి పాల్పడినట్లు అరస్టైయిన నిందితులు విచారణలో వెల్లడించారు. గ్యాంగ్‌లోని సభ్తులు సత్తార్షేక్, ఎండీ అసిదుల్ షేక్‌లు అరెస్ట్ కాగా మిగతా వారు పరారీలో ఉన్నారని సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి, క్రైమ్స్ అదనపు డీసీపీ ఎం.శ్రీనివాస్‌లు, కుషాయిగూడ ఏసీపీ రష్మీ పెరుమాళ్, కుషాయిగూడ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డీఐ గురువారెడ్డి, జవహర్‌నగర్ ఎస్హెచ్ఓ చంద్రశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ బాలు చౌహాన్, పాల్గొన్నారు.
ముందుగా ఆటోలో తిరుగుతూ దొంగతం చేయాల్సిన ప్రాంతాన్ని ఎంచుకుంటారు. రెక్కీ అనంతరం దొంగతనం చేసే రోజు ఎవరూ గుర్తుపట్టకుండా ముఖాలకు మాస్కులు ధరించి, పక్కా ప్లాన్‌తో తమ వద్ద ఉన్న పరికరాలతో పైఅంతస్థుకు రంధ్రం చేయడం లేదా పక్క గోడలు తొలగించి దొంగతనాలు చేస్తుంటారు. దొంగతనం అనంతరం రెండు గ్యాంగ్‌లుగా విడిపోతారు. తమ ప్రాంతాలకు రైళ్లు, బస్సులలో చేరుకొని, అక్కడ ఉన్న రిసీవర్స్‌తో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లో దొంగ సరుకును అమ్మేస్తుంటారు. పోలీసులకు దొరుకకుండా ఉండేందుకు దేశసరిహద్దులు దాటి సమీపంలో ఉన్న బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్నాళ్లు ఉండి, వచ్చిపోతుంటారు.