బాలానగర్, అక్టోబర్ 6: రియల్ రంగానికి గిరాకీ ఉండటంతో ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ బోయిన్ చెరువు మత్తడి సమీపంలోని ఎఫ్టీఎల్ పరిధిలో…1000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని గతంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించడం కోసం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ నర్సింహ యాదవ్ కేటాయించిన విషయం తెలిసిందే. కాగా ఈ స్థలాన్ని విద్యుత్ శాఖ అధికారులకు బదిలీ చేయడంలో అప్పటి రెవెన్యూ అధికారులు కొంత జాప్యం చేశారు. దీంతో సదరు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు కలిసి ఎలాగైనా కాజేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో పలు మార్లు ప్రహరీతో పాటు గదుల నిర్మాణం చేపట్టడంతో జీహెచ్ఎంసీ అధికారులు గురువారం కూల్చి వేశారు. చెరువు స్థలాన్ని రెవెన్యూ అధికారులు విద్యుత్ శాఖకు వెంటనే బదిలీ చేస్తే సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టడానికి అనువుగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని ఫిర్యాదులు అందిన వెంటనే చర్యలు చేపడుతున్నాం. ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ బోయిన్ చెరువు మత్తడి వద్ద ఎఫ్టీఎల్ పరిధిలోని ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఫిర్యాదు అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ నిర్మాణాన్ని కూల్చివేశాం. భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరుగకుండా చర్యలు తీసుకుంటాం.
-ఇర్షద్ , అసిస్టెంట్ సిటీ ప్లానర్, కూకట్పల్లి