అబిడ్స్, సుల్తాన్‌బజార్, అక్టోబర్ 6 : విజయదశమి వేడుకల్లో భాగంగా రావణ దహన కార్యక్రమాలను చేపట్టారు. గోషామహల్ నియోజకవర్గం పరిధిలో జమ్మిచెట్టుకు పూజ చేసిన అనంతరం ప్రజలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. ముస్లింజంగ్ వంతెన వద్ద గల భూలక్ష్మీ ఆలయం, రాంకోఠిలోని శ్రీ శక్తి గణపతి ఆలయం, అబిడ్స్‌లోని మహాలక్ష్మి, హిందీనగర్‌లోని దుర్గామాత , చుడీబజార్లోని వినాయక, చాదర్‌ఘాట్‌లోని సాయిబాబా ఆలయం, సీతారాంబాగ్‌లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పురానాపూల్, బషీర్‌బాగ్‌లోని శ్రీకనకదుర్గా శ్రీనాగలక్ష్మి, అబిడ్స్‌లోని మహాలక్ష్మి ఆలయం వద్ద, రాణి అవంతిబాయి భవన్, పురానాపూల్ వద్ద , పురానాపూల్ గణేశ్ఘాట్లో సీమోళ్లంగణ్ సమితి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గోషామహల్ మాజీ కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్ విచ్చేసి అతిథులను సన్మానించారు. రాణి అవంతిబాయి లోధ్ భవన్ ప్రాంతంలో లోథ్ క్షత్రియ సదర్ పంచాయత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మంగళ్‌హాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరిసింగ్ విచ్చేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వీరేందర్ సింగ్, రాంసింగ్, రమేశ్‌సింగ్, దినేశ్ సింగ్ హజారి, రూపేశ్సింగ్, లక్ష్మణ్ సింగ్, ఉమేశ్‌సింగ్ పాల్గొన్నారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ, రాజస్తానీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో రామాయణ్ మేళా లో భాగంగా వేడుకలను కనులపండుగగా నిర్వహించారు. శమీ పూజ, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడంతో పాటు రావణాసురుడు, మేఘనాథుడు, కుంభకర్ణుని నిలువెత్తు బొమ్మలను ఏర్పాటు చేసి పటాకులతో దహనం చేశారు. ఈ సందర్భంగా రామాయణంలో ముఖ్య ఘట్టాలపై ఆవిష్కరించిన సాంస్కృతిక ప్రదర్శనలు, భారతీయ కళా వైభావాన్ని చాటే విధంగా శాస్త్రీయ నృత్య రీతులు సమ్మోహితుల్ని చేశాయి.
ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శ్రీరామ వేషధారణ చేసిన వారికి తిలకం దిద్దారు. ఈ సందర్భంగా రామాయణ్ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్‌రాఠి బండారు దత్తాత్రేయ, అతిథులను సత్కరించారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో దసరా ఉత్సవాలకు ప్రాముఖ్యత ఉందని, ఎగ్జిబిషన్ సొసైటీ, రాజస్తానీ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్సవాలను నిర్వహిస్తారని కొనియాడారు. రామాయణ్ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్ రాఠి మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం దసరా ఉత్సవాలకు వేలాదిగా ప్రజలు తరలిరావడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం, రాజస్తానీ ప్రగతి సమాజ్ అధ్యక్షుడు కమల్నారాయణ్ అగర్వాల్, దాండియా కన్వీనర్లు వినయ్ కుమార్, సుమిత్‌రాఠి, గిరిధారిలాల్ డాగా, మనోజ్ జైస్వాల్, నందగోపాల్ భట్టడ్, కళావతి జాజు, రాజ్కుమార్సాంక్ల, మోహన్ప్తా పాల్గొన్నారు.