తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో నవ శకం మొదలైంది. 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో కీలక మలుపు చోటుచేసుకున్నది. దసరా పర్వదినాన తెలంగాణ రాష్ట్ర సమితిని (భారత్ రాష్ట్ర సమితిగా) మారుస్తూ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనపై గత రెండు రోజులుగా సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సహా అభిమానలోకం పెద్ద ఎత్తున రోడ్లపైకి తరలివచ్చి పటాకులు కాల్చి, స్వీట్లు పంచి ‘జై బీఆర్ఎస్.. జయహో కేసీఆర్’ అంటూ నినాదాలతో హోరెత్తించింది. గురువారం రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌లో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
– సికింద్రాబాద్/బొల్లారం, అక్టోబర్ 6
టీఆర్ఎస్ పార్టీని (బీఆర్ఎస్)గా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానించిన నేపథ్యంలో కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం చింతల్ బజార్,రిసాల బజార్ లోని ప్రధాన కూడళ్ల వద్ద గురువారం బోర్డు మాజీ సభ్యుడు లోక్‌నాథ్,టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యుడు లోక్‌నాథ్,సీనియర్ నాయకులు వార్డు అధ్యక్షుడు కేజీ రవి కుమార్,చందర్,కుమార్ పాల్గొన్నారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపస్తున్నారు. వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టి ప్రాజెక్టులు నిర్మించారు. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. ఇలాంటి నాయకుడు దేశాన్ని పాలిస్తే ప్రాజెక్టులకు రూపకల్పన జరుగుతుంది. . ఆయన బీఆర్ఎస్(భారత్ రాష్ట్ర సమితి) పేరుతో జాతీయ పార్టీ స్థాపించడంతో దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా రాణించి, దేశాన్ని పాలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
– జె. లోక్నాథం, బోర్డు మాజీ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు
సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) పేరిట జాతీయ పార్టీని స్థాపించడంతో దేశ రాజకీయాల్లో ఇక పై సమూల మార్పులు రానున్నాయి. భారత దేశం ఒక గొప్ప దార్శనికుడి నాయకత్వాన్ని చూడబోతున్నది. ఇప్పటివరకు దేశంలో మత రాజకీయాలు నడిచాయి. మతాలకతీతంగా యావత్తు దేశం అభివృద్ధి, సంక్షేమ ధ్యేయంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ఇది దేశానికి శుభ పరిణామం. కేంద్రలోని నిరంకుశ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి.
– మోతె శోభన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, టీటీయూసీ
బీఆర్ఎస్ నవ శకానికి నాంది పలుకుతుంది. ఉద్యమ నాయకుడు కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్.. రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపింది. పేదలు, రైతులు రెండు కండ్లుగా పాలన అందించిన కేసీఆర్ నాయకత్వాన్ని భారత ప్రజలు కోరుకుంటున్నారు.
– పాండుయాదవ్, బోర్డు మాజీ సభ్యుడు, కంటోన్మెంట్ బోర్డు