మేడ్చల్, అక్టోబర్5 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ సీఎం కేసీఆర్ తీర్మానించిన నేపథ్యంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద టపాకాయలు కాల్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి స్వీట్లను పంచుకున్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్)పార్టీగా ప్రకటించిన వెంటనే నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీలు నిర్వహించారు. దేశ్‌కి నేత కేసీఆర్ అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు మిన్నంటాయి. కేసీఆర్ పంతం.. బీజేపీ అంతం.. అంటూ.. కార్యకర్తలు ర్యాలీగా వెళ్తూ నినాదాలు చేశారు. విజయ దశమి రోజు ప్రారంభించిన బీఆర్ఎస్ దేశంలో చరిత్ర సృష్టిస్తుందని, దేశాభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని నాయకులు, కార్యకర్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నాయకులు నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సీఎం కేసీఆర్‌పై చేసిన నినాదాలు హోరెత్తాయి.
జాతీయ రాజకీయాలను స్వాగతిస్తున్నాం..
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్ర విభజన అనంతరం రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. అటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్పును స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌తో రైతులను ఆదుకుంటున్నారు. కేసీఆర్ వంటి నాయకుడు కావాలని దేశంలోని అన్ని రాష్ర్టాల రైతులు కోరుకుంటున్నారు.
–డాక్టర్ ఎస్ఎం ముజీబ్‌హుస్సేనీ, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు
భారత్ రాష్ట్ర సమితి పార్టీకి సంపూర్ణ మద్దతు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మార్పు చేయడం హర్షించదగ్గ విషయం. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ యాదవ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును తెలుపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఎంతో ఆదరిస్తున్నది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఉద్యోగులతో పాటు సబ్బండ వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది.
– మన్నె బోయిన కృష్ణాయాదవ్, తెలంగాణ యాదవ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (టీ యోపా)