సిటీబ్యూరో, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): నకిలీ కాల్‌సెంటర్ నిర్వహిసూ,్త పేరున్న సంస్థల ఖాతాదారులను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 555 ఫోన్లను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జాయింట్ సీపీ గజరావు భూపాలు, సైబర్‌క్రైమ్స్ ఏసీపీతో కేవీఎం ప్రసాద్‌తో కలిసి వెల్లడించారు. నగరానికి చెందిన మహ్మద్ సలీమ్, మహ్మద్ ఆరీఫ్ కలిసి రామంతాపూర్ కుర్మానగర్లోని ఒక అపార్టుమెంట్లో కాల్‌సెంటర్ నిర్వహిస్తున్నారు. సామ్సంగ్, ఎల్జీ, గోద్రెజ్, వర్ల్‌పూల్ తదితర బ్రాండ్ల పేర్లను ముందు జోడించి.. కాల్‌సెంటర్ పేర్లు తయారు చేశారు. వాటికి ఒక్కో ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నంబర్, కాల్‌సెంటర్ పేరుతో గూగుల్‌లో ప్రకటనలు ఇచ్చారు.
ఈ ప్రకటనలు గూగుల్‌లో సెర్చ్ చేయగానే మొదట కనిపించే విధంగా చేశారు. దానికి తోడు గూగుల్ మ్యాప్స్‌లోనూ కాల్‌సెంటర్ పేర్లు, ఫోన్ నంబర్లు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఆయా సంస్థలకు సంబంధించిన అసలైన కస్టమర్లు, తమ ప్రొడక్ట్‌కు సంబంధించిన కంపెనీ కాల్ సెంటర్‌ను గూగుల్‌లో సెర్చ్ చేయగా.. వెంటనే రామంతాపూర్‌లో ఉన్న కాల్సెంటర్లోని ఫోన్ నంబర్లు కనిపిస్తుంటాయి. సంస్థ పేరు ఉండటంతో వినియోగదారులు ఆ నంబర్లకు ఫోన్ చేశారు. కస్టమర్ ఫోన్ చేయగానే కాల్సెంటర్లో సమస్యను నోట్ చేసుకుంటూ.. ఆ తర్వాత ఆ సమస్యను పరిష్కరించేందుకు లోకల్ టెక్నీషియన్స్‌ను పంపించారు. కస్టమర్ కాల్ చేసిన తర్వాత ఇంటికి వెళ్లి వస్తే రూ. 300 చార్జీ చేశారు. ఏదైనా రిపేర్ చేస్తే దానికి రూ. 2500 నుంచి రూ. 5000 వరకు వసూలు చేశారు.
అసలైన కాల్‌సెంటర్ చార్జీల కంటే వీళ్ల చార్జీలు 30 నుంచి 40 శాతం ఎక్కువగా ఉంటాయి. ఇదిలాఉండగా.. ఈ కాల్సెంటర్లో 30 మంది టెలీకాలర్స్ పనిచేస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడకు కాల్స్ వస్తుంటాయి. అందుకు తగ్గట్టుగా తమది అసలైన సంస్థ అని చెప్పి టెక్నీషియన్స్‌ను కూడా దేశ వ్యాప్తంగా నియమించుకున్నారు. పనిచేస్తున్న టెలీకాలర్స్‌కు, టెక్నీషియన్స్‌కు అనుమానం రాకుండా అసలైన సంస్థల నుంచి తమ కు అగ్రిమెంట్లు ఉన్నాయంటూ నమ్మిస్తున్నారు. రెండేండ్లుగా ఈ కాల్‌సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. రోజు రూ. 5 లక్షల వరకు టర్నోవర్ చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఇన్స్పెక్టర్ డి.దస్రు ఆధ్వర్యంలో తిరుమలేశ్, ఉపేందర్, శ్రీధరాచారి తదితర బృందం ఈ నకిలీ సెంటర్‌పై దాడి చేశారు. నిర్వాహకులిద్దరిని అరెస్టు చేసి, కాల్ సెంటర్లో ఉన్న బేసిక్ మోడల్‌కు చెందిన 555 ఫోన్స్, రెండు స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశారు.