కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 30 : అడవుల సంరక్షణే కర్తవ్యంగా పని చేసినప్పుడే వృత్తిరీత్యా తగిన గుర్తింపు ఉంటుందని తెలంగాణ అటవీ అదనపు సంరక్షణాధికారి, దూలపల్లి ఫారెస్టు అకాడమీ డైరెక్టర్ డా.పీవీ రాజారావు అన్నారు. శనివారం అకాడమీలో 31వ బ్యాచ్ అటవీ బీట్ అధికారులు ఆరు నెలల శిక్షణ పొంది అర్హత సాధించిన 55 మందికి బంగారు పతకాలతోపాటు ప్రతిభా అవార్డులను అందజేశారు. అంతకు ముందు బీటు అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ కోర్సు డైరెక్టర్ ఎస్.ఏ నాగినీభాను అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో అమలు పర్చాలన్నారు. శి
క్షణ నిరంతర ప్రక్రియ అని, పరిస్థితిల నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటూ వృత్తిని సమర్థవంతంగా నిర్వహించి అడవుల సంరక్షణకు పాటుపడాలని సూచించారు. ఖమ్మం అటవీ డివిజన్‌కు చెందిన కె.అనూష అత్యుత్తమ ప్రతిభను కనబరిచి 82 శాతం మార్కులతో బ్యాచ్ టాపర్‌గా, ఆల్ రౌండర్‌గా నిలిచి నాలుగు బంగారు పతకాలను సాధించింది. పి.మధుసూదన్ రెండు బంగారు పతకాలు, ఎం.శ్రావణ్‌కుమార్, ఆర్.శ్రీనివాస్, బి.రాజశేఖర్, బి.చిన్న, ఆర్.ప్రశాంత్, బి.ఝాన్సీరాణి వివిధ విభాగాల్లో ఒక్కో బంగారు పతకాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధికారి జి.రవీందర్, అకాడమీ అదనపు డైరెక్టర్ ఎస్.రమేశ్, సంయుక్త డైరెక్టర్ ప్రవీణ, డిప్యూటీ డైరెక్టర్లు సీహెచ్.రంగారెడ్డి, వి.ఆంజనేయులు, వి.రామ్మోహన్, రేంజ్ అధికారులు ఎం.వంశీకృష్ణ, పి.సునీత, వై.సుభాష్చంద్రయాదవ్, కె.శివజ్యోతి, ఎం.రామ్మోహన్, బాబాఖాదర్ అలీ, పి.సునీత తదితరులు పాల్గొన్నారు.