సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): నకిలీ కాల్‌సెంటర్ ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న అమాయకులను మోసం చేస్తున్న ఘరానా సైబర్‌నేరగాళ్ల ముఠాను రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కత్తలో ఉండే ఈ కాల్సెంటర్లలో పనిచేసేందుకు తెలంగాణ, తమిళనాడు, కేరళకు చెందిన టెలీకాలర్స్‌ను నియమించుకొని, బాధితుల భాషాలోనే మాట్లాడుతూ.. ఈజీగా మోసాలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఈ ముఠా 116 సైబర్‌నేరాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. కోల్కత్తలో రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్‌లో నకిలీ కాల్‌సెంటర్ల బాగోతం గుట్టురట్టయ్యింది. రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ వివరాలు వెల్లడించారు.
ఇబ్రహీంపట్నంకు చెందిన కెలోత్ కిషన్ నాప్టల్ ఈ కామర్స్ వెబ్సైట్ ద్వారా కుట్టుమిషన్ కొన్నాడు. కొన్ని రోజుల అనంతరం నాప్టల్ ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున లక్కీ డ్రాకు సంబంధించిన కూపన్ అంటూ ఒక కవర్ ఇంటికి వచ్చింది. అందులో ఉన్న స్క్రాచ్కార్డును స్క్రాచ్ చేయడంతో మహేంద్ర ఎక్స్‌యూవీ(రూ. 8.2 లక్షల విలువైన) గెలుపొందినట్లు కార్డుపై ఉంది. హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడంతో బాధితుడి వద్ద వివిధ ఫీజుల పేరుతో రూ. 48200 వసూలు చేశారు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు ఈ ఏడాది జూన్ 8న రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
బాధితుడికి వచ్చిన ఫోన్ కాల్స్, డబ్బు డిపాజిట్ చేసిన ఖాతాలను పరిశీలించారు. బీహార్, జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్ కేంద్రంగా ఇలాంటి నేరాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ముఠాను పట్టుకునేందుకు ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్, శంకర్ నేతృత్వంలో తెలంగాణ సైబర్ క్రైమ్స్ కో ఆర్డినేషన్ సెంటర్(టీ4సీ) సమన్వయంతో ప్రత్యేక బృందాలు పశ్చిమబెంగాల్‌కు వెళ్లాయి. మూడు నకిలీ కాల్‌సెంటర్ల ఆచూకీ లభించడంతో వాటిపై దాడులు నిర్వహించి ప్రధాన నిర్వాహకుడితో పాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 7 మంది తెలంగాణకు చెందిన టెలీకాలర్స్ ఉన్నారు.
బీహార్‌కు చెందిన ఉత్తమ్‌కుమార్ యాదవ్ కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నాడు. ఇతడి వద్ద బీహార్‌కు చెందిన ముఖేశ్‌కుమార్ ప్రధాన సహాయకుడిగా ఉన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా, గొల్లబండ తాండకు చెందిన ముదావత్ రమేశ్ ముఖేశ్‌కు ప్రధాన అనుచరుడిగా మారాడు. ఈ క్రమంలోనే కాల్సెంటర్లో టెలీకాలర్స్‌గా పనిచేసేందుకు గొల్లబండ తాండాకు చెందిన జరుపాల శంకర్, ఎల్.రాజు, కె. రాంచందర్, గుంటూర్‌కు చెందిన కొండ జగన్మోహన్రెడ్డి, వరంగల్‌కు చెందిన ఓర్స్ చందు, మెదక్‌కు చెందిన గాందే శ్రీశైలంను నియమించుకున్నారు.
వీళ్లకు మోసం చేసి సంపాదించే డబ్బులో 30 శాతం కమీషన్ ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. కోల్కత్తలో సమస్య వస్తే మరో ప్రాంతానికి వెళ్లి మోసాలు చేయాలి. వీళ్లకు కావాల్సిన తెలంగాణ కస్టమర్ల డేటాను ఉత్తమ్‌కుమార్ అందిస్తాడు. మోసం చేసి డబ్బు సేకరించాల్సిన పనులు టెలీకాలర్స్ చేస్తుంటారు. రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు దాడి చేసిన సమయంలో 9 మంది పట్టుబడ్డారు. క్రిప్టోకరెన్సీతో పాటు కంప్యూటర్స్, ల్యాప్‌టాప్‌లో సుమారు రూ. 20 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల్లో 116 కేసులతో ఈ నకిలీ కాల్‌సెంటర్ల ముఠాకు సంబంధాలుండగా అందులో 34 కేసులు తెలంగాణవి.