మేడ్చల్ రూరల్, సెప్టెంబర్ 21 : సీఎం కేసీఆర్ను ప్రజాబంధుగా మంత్రి చామకూర మల్లారెడ్డి అభివర్ణించారు. వివిధ రకాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీల పరిధిలోని మహిళలకు బుధవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతులు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, కుల వృత్తులకు చేయూత.. తదితర పథకాలతో ప్రజలందరికీ సీఎం కేసీఆర్ మేలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు సీఎం కేసీఆర్ను ఇంటి పెద్ద కొడుకులా, మేనమామలా, సోదరుడిగా ఆదరిస్తున్నారని తెలిపారు. కొట్లాడి సాధించిన తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా అన్ని మతాల పండుగలకు ప్రాధాన్యతనిచ్చారన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడ బిడ్డలకు చీరలను పంపిణీ చేస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. అది చరిత్రాత్మకంగా ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా దళితుల గురించి పట్టించుకున్న నాధుడే లేడన్నారు. మాటలతో సరిపెట్టడమే తప్ప.. ఎవరు కూడా ఆదుకోలేదన్నారు. దళితులను సామాజికంగా, ఆర్థికంగా వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. గిరిజనులను ఆదుకునేందుకు గిరిజన బంధును కూడా త్వరలో అమలు చేయనున్నారని తెలిపారు. ఇలాంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. అమలు చేసే దమ్ము కూడా ఎవరికి లేదని మంత్రి తెలిపారు. బతుకమ్మ, దసరా పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల చైర్పర్సన్లు మర్రి దీపికానర్సింహారెడ్డి, మద్దుల లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్లు చీర్ల రమేశ్, దామన్నగారి ప్రభాకర్, కౌన్సిలర్లు బేరి బాలరాజ్, చింత పెంటయ్య, మారేపల్లి రాజకుమారి సుధాకర్, ఆంథోన్మ ఫిలిప్స్, జాకట దేవరాజ్, తుడుం గణేశ్, పెంజర్ల నర్సింహ స్వామి, బత్తుల శివకుమార్ యాదవ్, ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, జంగ హరికృష్ణ, ఉమా నాగరాజు, కౌడె మహేశ్, అమరం సరస్వతి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్ మున్సిపాలిటీల టీఆర్ఎస్ అధ్యక్షులు సంజీవగౌడ్, శేఖర్ గౌడ్, కమిషనర్లు షఫీయుల్హా, రాములు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్ ముదిరాజ్, మండల రవీందర్ గౌడ్, నవీన్ రెడ్డి, మహబూబ్ అలీ, గీతామధుకర్, రవీందర్, నాగరాజు, మధుకర్ యాదవ్, సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.